ప్రణీత్‌ ఒక్కడే క్వార్టర్స్‌కు

2 Aug, 2019 04:50 IST|Sakshi

ప్రిక్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌ ఔట్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: టైటిల్‌ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500’ టోర్నమెంట్‌లో ఇప్పుడు భారత్‌ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్‌పైనే ఉన్నాయి. ఈ అన్‌సీడెడ్‌ షట్లర్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీకి చుక్కెదురైంది.  

సాయి ప్రణీత్‌ అలవోక విజయం
మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్‌తో సహచరుడు శుభాంకర్‌ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్‌పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శుభాంకర్‌ ప్రతీ గేమ్‌లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్‌ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్‌ ఫెప్రదబ్‌ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్‌ నిలువలేకపోయాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ఆటను జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరోసీడ్‌ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు.

సైనా పోరాటం సరిపోలేదు
మహిళల సింగిల్స్‌లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్‌ విజయంతో టచ్‌లోకి వచ్చింది. తర్వాత గేమ్‌లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్‌ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్‌ భారత స్టార్‌ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్‌ ఫజర్‌–ముహమ్మద్‌ రియాన్‌ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్‌ఫియాన్‌–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్‌ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్‌ తంగ్‌చన్‌ మన్‌– సె యింగ్‌ సుయెట్‌ (హాంకాంగ్‌) జంట చేతిలో ఓడింది.  

మరిన్ని వార్తలు