ఈ సారి తై జు యింగ్‌ను ఓడిస్తాం

31 Aug, 2018 07:49 IST|Sakshi

కోచ్‌ గోపీచంద్‌ వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: భారత టాప్‌స్టార్స్‌కు మింగుడు పడని చైనీస్‌ తైపీ ప్రత్యర్థి తై జు యింగ్‌ను త్వరలోనే ఓడిస్తామని బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఆసియా గేమ్స్‌లో సింధు, సైనాలిద్దరు రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరిద్దరిని ప్రపంచ నంబర్‌వన్‌ తై జునే ఓడించింది. భారత బ్యాడ్మింటన్‌ బృందం స్వదేశం చేరాక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్‌ మాట్లాడుతూ ‘సింధు, సైనాలిద్దరు మేటి షట్లర్లు. మానసిక, శారీరక స్థైర్యంతో ఉన్నారిద్దరు. ఎవరికి తీసిపోరు. అంత తేలిగ్గా ఓడిపోరు. త్వరలోనే తైపీ మిస్టరీని ఛేదిస్తారు. రచనోక్‌ ఇంతనోన్‌ను ఓడించినట్లే తై జుపై గెలుస్తారు. ఏటా చాలా టోర్నీలు జరుగుతున్నాయి. ఇందులో ఆడటం ద్వారా ప్రదర్శన, పోటీతత్వం మరింత మెరుగవుతాయి. అప్పుడు ఆమెను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. టాప్‌స్టార్స్‌ ఇద్దరు కలిసి ఆమె చేతిలో మొత్తం 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు.

దీనిపై గోపీ మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఆమె ఓ లేడీ తౌఫిక్‌ హిదాయత్‌ (మాజీ ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌). అన్నింటా మెరుగైన ప్రత్యర్థి. కోర్టుల్లో చురుగ్గా కదం తొక్కుతుంది. తనకెదురైన ప్రత్యర్థికి దీటుగా బదులిస్తుంది. స్మార్ట్‌గా స్పందిస్తుంది. అన్ని రంగాల్లోనూ బలంగా ఉంది. ప్రస్తుతం తై జు, మారిన్‌ (స్పెయిన్‌) ప్రపంచ టాప్‌ షట్లర్లు. వీరిని ఓడించే వ్యూహాలతో సిద్ధమవుతాం’ అని వివరించారు. ఆసియా గేమ్స్‌ బ్యాడ్మింటన్‌లో తొలిసారి రెండు పతకాలు గెలవడం ఆనందంగా ఉందన్నారు. 23 ఏళ్ల సింధు మాట్లాడుతూ ‘పోడియం ఫినిష్‌ ఎప్పటికీ చిరస్మరణీయమే. పతక విజేతగా నిలబడి మనముందు జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేను. అయితే ఈ పతకాలను ఆస్వాదించే సమయం కూడా మాకు లేదు. జపాన్‌ ఓపెన్‌ (సెప్టెంబర్‌ 11 నుంచి) కోసం వెంటనే సన్నాహకాల్లో పాల్గొనాలి’ అని చెప్పింది. తన ఆసియా గేమ్స్‌ పతకాన్వేషణ ఎట్టకేలకు జకార్తాలో ముగిసిందని సైనా తెలిపింది. ‘నాకు ఇది నాలుగో ఏషియాడ్‌. గత మూడు ఈవెంట్లలోనూ ఎంతో కష్టపడ్డా సాధ్యం కాలేదు. చివరకు ఇక్కడ సాకారమైంది’ అని చెప్పింది.

>
మరిన్ని వార్తలు