సింధు మిగిలింది!

13 Apr, 2019 03:38 IST|Sakshi

సెమీస్‌లో తెలుగుతేజం 

సైనా, శ్రీకాంత్‌ ఔట్‌ 

సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌  

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ లో పీవీ సింధు ఆట మాత్రమే మిగిలింది. ఈ నాలుగో సీడ్‌ తెలుగుతేజం మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఇంకా టైటిల్‌ బోణీ కొట్టని సింధు ఇప్పుడు ఆ వేటలో రెండడుగుల దూరంలో ఉంది. ఆమె మినహా మిగతా భారత షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనే  కంగుతిన్నారు. మహిళల సింగిల్స్‌లో వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌తో పాటు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ పరాజయం చవిచూశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ కూడా ఓడిపోయింది. 

శ్రమించి సెమీస్‌కు...  
భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధుకు ప్రపంచ 18వ ర్యాంకర్‌ కై యన్‌యన్‌ (చైనా) గట్టిపోటీనిచ్చింది. దీంతో మ్యాచ్‌ గెలిచేందుకు నాలుగో సీడ్‌ సింధు చెమటోడ్చాల్సివచ్చింది. గంటపాటు జరిగిన ఈ పోరులో చివరకు 21–13, 17–21, 21–14తో చైనా ప్రత్యర్థిని కంగుతినిపించింది. మరో క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 8–21, 13–21తో రెండో సీడ్‌ నొజొమి ఒకుహర (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు (శనివారం) జరిగే సెమీఫైనల్లో సింధు... ఈ మాజీ ప్రపంచ చాంపియన్‌ ఒకుహరతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ శ్రీకాంత్‌ 18–21, 21–19, 9–21తో టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో, సమీర్‌ వర్మ 10–21, 21–15, 15–21తో రెండో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 14–21, 16–21తో మూడో సీడ్‌ డెచపొల్‌ పువరనుక్రొ–సప్సిరి టెరతనచయ్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో కంగుతింది.

మరిన్ని వార్తలు