క్వార్టర్స్‌లో సైనా

29 May, 2015 01:06 IST|Sakshi
క్వార్టర్స్‌లో సైనా

శ్రీకాంత్ ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్

 
 సిడ్నీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మినహా.. మిగతా వారు నిరాశపర్చారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ సైనా 21-19, 19-21, 21-14తో సన్ యు (చైనా)పై నెగ్గి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ శ్రీకాంత్ 21-18, 17-21, 13-21తో టియాన్ హోవోయి (చైనా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ లో జ్వాలా-అశ్విని జోడి 14-21, 10-21తో నాలుగోసీడ్ ఇండోనేసియా జంట నిత్య క్రిషిందా మహేశ్వరి-గ్రేసియా పోలీ చేతిలో పరాజయం చవిచూసింది.

 సన్ యుతో గంటా 18 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో సైనాకు గట్టి ప్రతిఘటనే ఎదురైంది. తొలి గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన హైదరాబాదీ 5-5, 11-6తో ఆధిక్యాన్ని సాధించింది. ఈ దశలో సన్ పుంజుకొని 18-18తో స్కోరును సమం చేసినా సైనా ధాటికి నిలువలేకపోయింది. రెండో గేమ్‌లో ఆరంభంలో సైనా జోరు కనబర్చినా.. చివర్లో సన్ కట్టడి చేసింది. ఓ దశలో భారత అమ్మాయి 13-7 ఆధిక్యంలో నిలిచినా... సన్ వీరోచితంగా పోరాడుతూ 13-13తో స్కోరును సమం చేసింది.

తర్వాత సైనా 18-15 ఆధిక్యాన్ని సంపాదించినా సన్ ధాటికి వరుసగా పాయింట్లు కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడినా సైనా 12-4 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు సన్ చేసిన ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొట్టిన హైదరాబాదీ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ఐదోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా తలపడుతుంది.

మరిన్ని వార్తలు