క్వీన్‌ సైనా

28 Jan, 2019 01:05 IST|Sakshi

ఇండోనేసియా మాస్టర్స్‌ టైటిల్‌ నెగ్గిన భారత షట్లర్‌

ఫైనల్లో గాయంతో తప్పుకున్న కరోలినా మారిన్‌  

జకార్తా: ఇండోనేసియా గడ్డపై భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ అనుబంధం కొనసాగుతోంది. గతంలో ఇక్కడ పలు చిరస్మరణీయ విజయాలు సాధించిన సైనా... ఇప్పుడు మరో మేజర్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అర్ధాంతరంగా ముగిసిన ఫైనల్లో విజేతగా నిలిచి ఇండోసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నీలో సైనా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తొలి గేమ్‌లోనే కాలి గాయంతో తప్పుకుంది. ఆ సమయంలో సైనా 4–10తో వెనుకబడి ఉంది.

విజేత సైనాకు 26, 250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 61 వేలు) లభించింది. 2018లో ఇదే టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా... ఇప్పుడు విజయం అందుకుంది. గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ కావడం విశేషం. 2017 జనవరిలో ఆమె మలేసియా మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచింది.  గత వారమే మలేసియా మాస్టర్స్‌ టోర్నీలో సైనాపై ఘన విజయం సాధించిన మారిన్‌ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. వేగంగా కదులుతూ తొలి రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న మారిన్‌ అదే జోరును కొనసాగించింది. సైనా తప్పిదాలతో ఆమె 6–2తో ముందంజ వేసింది.

దూకుడు పెంచిన మారిన్‌ 9–2తో దూసుకుపోయిన దశలో కోర్టులో అనూహ్యంగా పడిపోవడంతో కాలికి గాయమైంది. చికిత్స అనంతరం ఆమె ఆట కొనసాగించినా...మరో మూడు పాయింట్ల తర్వాత ఇక తన వల్ల కాదంటూ కుప్పకూలింది. కన్నీళ్లతో మారిన్‌ కోర్టు వీడగా...సైనా విజేతగా ఆవిర్భవించింది. ‘నేను టైటిల్‌ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను. కఠినమైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌ వరకు వెళ్లడం సంతోషకరం. ఫైనల్లో నేను వెనుకబడ్డాననేది వాస్తవం. అయితే గట్టిగా పోరాడేదాన్ని. దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కోర్టులో ఈ తరహాలో గాయపడటం చాలా బాధాకరం. నాకు కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది కాబట్టి ఆ వేదన ఎలాంటిదో బాగా తెలుసు’ అని మ్యాచ్‌ అనంతరం సైనా వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు