వారెవ్వా... వారియర్స్

7 Jan, 2016 02:20 IST|Sakshi
వారెవ్వా... వారియర్స్

సైనా జట్టుకు రెండో విజయం
బెంగళూరుకు మూడో ఓటమి
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
 లక్నో:
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి... వెనుకబడిన దశలో అవధ్ వారియర్స్ జట్టు అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. వరుసగా రెండు ‘ట్రంప్ మ్యాచ్’ల్లో నెగ్గి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో రెండో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. బెంగళూరు టాప్‌గన్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు 4-1తో గెలుపొందింది. తొలి మ్యాచ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఖిమ్ వా లిమ్ ద్వయం 15-13, 11-15, 15-13తో బోదిన్ ఇసారా-మనీషా జంట (అవధ్ వారియర్స్)ను ఓడించి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది.
 
  రెండో మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 46వ ర్యాంకర్ సమీర్ వర్మ 15-13, 15-14తో ప్రపంచ 34వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను బోల్తా కొట్టించడంతో బెంగళూరు 2-0తో ముందంజ వేసింది. అవధ్ వారియర్స్‌కు విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో తనోంగ్‌సక్ సెన్‌సోమ్‌బూన్‌సుక్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు.
 
  బెంగళూరు జట్టు‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకున్న మ్యాచ్‌లో తనోంగ్‌సక్ (వారియర్స్) 15-11, 15-10తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు)ను ఓడించాడు. ఫలితంగా వారియర్స్ ఖాతాలో ఒక పాయింట్ చేరగా... బెంగళూరు జట్టు ఒక పాయింట్‌ను చేజార్చుకుంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. ‘ట్రంప్ మ్యాచ్’గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-10, 13-15, 15-8తో సూ దీ (బెంగళూరు)పై గెలుపొందడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరడంతోపాటు 3-1తో విజయం ఖాయమైపోయింది.
 
  ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (అవధ్ వారియర్స్) జంట 15-12, 15-6తో హూన్ థిన్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీని ఓడించడంతో వారియర్స్ ఓవరాల్‌గా 4-1తో విజయాన్ని దక్కించుకుంది. గురువారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ జట్టు తలపడుతుంది.
 

మరిన్ని వార్తలు