సైనా చేజేతులా...

5 Apr, 2015 01:17 IST|Sakshi

మలేసియా సెమీస్‌లో ఓటమి
చేజారిన నంబర్‌వన్
 

కౌలాలంపూర్ : కచ్చితమైన షాట్లు... బలమైన బేస్‌లైన్ ఆటతీరు... నాణ్యమైన డ్రాప్ షాట్లు... తిరుగులేని ఆధిపత్యంతో తొలి గేమ్ సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. రెండో గేమ్‌లో మొదలైన తడబాటును కీలకమైన మూడో గేమ్‌లోనూ అధిగమించలేకపోయింది. ప్రత్యర్థి మోకాలి గాయంతో కోర్టులో ఇబ్బందిగా కదులుతున్నా... ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరిగిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో ‘నంబర్‌వన్’ ర్యాంక్‌ను కూడా చేజార్చుకుంది.

శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ సైనా 21-13, 17-21, 20-22తో టాప్‌సీడ్, ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలి గేమ్‌లో స్కోరు 6-6తో సమమైన తర్వాత సైనా వరుస పాయింట్లతో 11-6, 15-7 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి  పుంజుకునే ప్రయత్నం చేసినా... హైదరాబాదీ నాణ్యమైన బేస్‌లైన్ ఆటతీరుతో గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో  స్కోరు 10-10తో సమమైంది.

ఈ దశలో జురుయ్ నెట్ వద్ద కీలకమైన డ్రాప్ షాట్లతో సైనాను కట్టిపడేసి 18-17తో ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత మరో మూడు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్‌లో సైనా 12-7 ఆధిక్యంలో నిలిచినా... జురుయ్ తన ఎత్తుతో చిత్తు చేసింది. బలమైన స్ట్రోక్స్‌తో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 12-12తో సమంగా నిలిచింది.  అయితే సైనా గేమ్ చివర్లో తడబడింది. సైనా 19-18తో ఆధిక్యంలో ఉన్న దశలో జురుయ్ 19-19, 20-20తో స్కోరును సమం చేయడంతో పాటు మరో రెండు పాయింట్లతో మ్యాచ్ గెలిచింది.
 
సెమీస్‌లో ఓటమితో మహిళల విభాగంలో సైనా నంబర్‌వన్ ర్యాంక్ కూడా పోయింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడంతో అగ్రస్థానానికి చేరిన ఈ హైదరాబాదీ... గురువారం అధికారికంగా టాప్‌కు చేరింది. అయితే మలేసియా సెమీస్‌లో ఓడిపోవడంతో తిరిగి నంబర్‌వన్‌ను లీ జురుయ్‌కు కోల్పోయింది.  గురువారం అధికారికంగా  ప్రకటించేవరకు సైనాయే నంబర్‌వన్.

మరిన్ని వార్తలు