ప్రిక్వార్టర్స్‌లో సైనా

23 Jan, 2014 00:46 IST|Sakshi

లక్నో: సయ్యద్ మోడి స్మారక ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ సైనా నెహ్వాల్, డిఫెండింగ్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మిగతా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్లో రెండో సీడ్ పీవీ సింధు, క్వాలిఫయర్ సంతోషి హాసిని, మూడో సీడ్ గురుసాయిదత్, ఆరో సీడ్ శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
 
 చెమటోడ్చిన సింధు
 మహిళల సింగిల్స్‌లో హైదరాబాదీ స్టార్, టాప్ సీడ్ సైనా బుధవారం జరిగిన తొలిరౌండ్లో 21-7, 21-9తో మటిల్డా పీటర్సన్ (స్వీడన్)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. గత రన్నరప్, రెండో సీడ్ సింధు 21-19, 24-22తో లీ లియాన్ యంగ్ (మలేసియా)పై చెమటోడ్చి నెగ్గింది. సంతోషి హాసిని 21-16, 16-21, 21-18తో జూహీ దేవాంగన్ (భారత్)పై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో  పెర్మినోవా (రష్యా) తో సైనా, సబ్రినా (స్విట్జర్లాండ్)తో సింధు, హీరా దేసి (ఇండోనేసియా)తో సంతోషి తలపడతారు.
 
 కశ్యప్ ముందంజ
 పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కశ్యప్ రెండు రౌండ్లలోనూ విజయం సాధించాడు. తొలి రౌండ్లో అతను 21-14, 21-16తో భారత సహచరుడు అనూప్ శ్రీధర్‌పై గెలుపొందాడు. రెండో రౌండ్లో 21-10, 21-12తో యీ హాన్ చోంగ్ (మలేసియా)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో గురుసాయిదత్ 21-11, 21-11తో విపుల్ సైనిపై గెలుపొందగా, జాతీయ చాంపియన్ శ్రీకాంత్ 21-16, 22-20తో కియాన్ మెంగ్ తన్‌పై విజయం సాధించాడు. సాయిప్రణీత్ 21-10, 21-9తో సౌరవ్ కపూర్‌పై గెలుపొందాడు.  సీనియర్ ఆటగాడు చేతన్ ఆనంద్ 21-9, 21-7తో సృజన్ నందలూరిపై నెగ్గాడు.
 

మరిన్ని వార్తలు