శ్రమించిన సైనా

14 Oct, 2015 23:48 IST|Sakshi
శ్రమించిన సైనా

ఒడెన్స్ (డెన్మార్క్): టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో తొలి అడ్డంకిని కష్టపడి అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ సైనా 23-21, 14-21, 21-18తో ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై శ్రమించి గెలిచింది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో 20-21తో గేమ్ కోల్పోయే స్థితిలో నిలిచిన సైనా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది.
 
  అయితే రెండో గేమ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఆటతీరు తడబడింది. ఒకదశలో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయిన సైనా అదే క్రమంలో గేమ్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా సంయమనంతో ఆడి కీలకదశలో పాయింట్లు నెగ్గి 18-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుసానన్ కూడా రెండు పాయింట్లు నెగ్గి తేడాను తగ్గించింది. ఈ దశలో సైనా నిర్లక్ష్యానికి తావివ్వకుండా రెండు పాయింట్లు నెగ్గి 20-14తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ నాలుగు  పాయింట్లు గెలిచినా... వెంటనే సైనా మరో పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మినత్సు మితాని (జపాన్)తో సైనా ఆడుతుంది. మరో మ్యాచ్‌లో పీవీ సింధు 21-13, 21-11తో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)పై సులువుగా నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
 
 జయరామ్ ఓటమి
 మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-10, 21-14తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై గెలిచాడు. గతవారం డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గి జోరుమీదున్న జయరామ్‌పై శ్రీకాంత్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి 32 నిమిషాల్లోనే విజయాన్ని దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 24-22, 21-13తో మార్కస్ ఇలిస్-క్రిస్ లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ 19-21, 18-21తో ఏడో సీడ్ రీకా కాకివా-మియుకి మయెదా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు