శభాష్ ...సాయిప్రణీత్‌

24 Aug, 2017 00:26 IST|Sakshi
శభాష్ ...సాయిప్రణీత్‌

ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ యువతార భమిడిపాటి సాయిప్రణీత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో ముందడుగు వేశాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్న ఈ తెలుగు తేజం రెండో రౌండ్‌లో ఓటమి అంచుల్లో ఉన్న దశలో పట్టుదలతో పోరాడి గట్టెక్కాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరోవైపు ఎనిమిదో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్, 12వ సీడ్‌ సైనా నెహ్వాల్‌ అలవోక విజయాలతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.   

గ్లాస్గో (స్కాట్లాండ్‌): అత్యున్నత వేదికపై అదరగొట్టే ఆటతీరును ప్రదర్శించేందుకు వచ్చిన అవకాశాన్ని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వరుసగా ఐదో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం గెలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 14–21, 21–18, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై గెలుపొందగా... శ్రీకాంత్‌ 21–9, 21–17తో లుకాస్‌ కోర్వి (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ (భారత్‌) 20–22, 9–21తో 16వ సీడ్‌ రాజీవ్‌ ఉసెఫ్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడాగా... 13వ సీడ్‌ అజయ్‌ జయరామ్‌ 21–13, 21–18తో మార్క్‌ కాల్‌జు (నెదర్లాండ్స్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)తో పోరుకు సిద్ధమయ్యాడు.

మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సైనా నెహ్వాల్‌ రెండో రౌండ్‌లో 21–11, 21–12తో సబ్రీనా జాక్వెట్‌ (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సైనా వరుసగా ఎనిమిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో తన్వీ లాడ్‌ (భారత్‌) 9–21, 19–21తో సుంగ్‌ జీ హున్‌ చేతిలో, రితూపర్ణ దాస్‌ (భారత్‌) 16–21, 13–21తో 16వ సీడ్‌ క్రిస్టీ గిల్మౌర్‌ (స్కాట్లాండ్‌) చేతిలో ఓడిపోయారు.   

వరుసగా 8 పాయింట్లు...
జిన్‌టింగ్‌తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ పుంజుకున్నతీరు అద్భుతం. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ రెండో గేమ్‌లో కోలుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో జిన్‌టింగ్‌ దూకుడుగా ఆడి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఈ ఏడాది సింగపూర్‌ ఓపెన్, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన సాయిప్రణీత్‌ ఓటమి దిశగా పయనిస్తున్నా విజయంపై ఆశలు వదులుకోలేదు. కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సాయిప్రణీత్‌... నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 20–18తో విజయం అంచుల్లోకి వచ్చాడు. జిన్‌టింగ్‌ ఒక పాయింట్‌ గెలిచినా, వెంటనే సాయిప్రణీత్‌ మరో పాయింట్‌ సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మార్క్‌ జ్విబ్లెర్‌ (జర్మనీ) లేదా చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో సాయిప్రణీత్‌; ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)తో శ్రీకాంత్‌; రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (కొరియా)తో సైనా నెహ్వాల్‌; ఎన్గాన్‌ యి చెయుంగ్‌ (హాంకాంగ్‌)తో పీవీ సింధు తలపడతారు. 
 
మరోవైపు మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) 22–24, 21–19, 15–21తో రెండో సీడ్‌ కామిల్లా రైటర్‌జుల్‌–క్రిస్టినా పెడర్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో... ఆరతి సారా సునీల్‌–సంజన సంతోష్‌ (భారత్‌) 14–21, 15–21తో యిక్సిన్‌ బావో–జియోహాన్‌ యు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన–పూర్వీషా 21–13, 16–21, 8–21తో ముస్కెన్క్‌–పియెక్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అర్జున్‌–శ్లోక్‌ 14–21, 21–19, 14–21తో మిన్‌ చున్‌–చెంగ్‌ హెంగ్‌ సు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు