సైనా, సింధు కొత్త చరిత్ర

26 Aug, 2018 15:14 IST|Sakshi

సెమీస్‌ చేరి పతకాలు ఖాయం చేసుకున్న భారత స్టార్స్‌

జకార్తా: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఆసియా క్రీడల్లో అందని ద్రాక్షగా ఊరిస్తోన్న బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ పతకం ఎట్టకేలకు ఖాయమైంది. స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లడంతో భారత్‌కు ఒకేసారి రెండు పతకాలు లభించనున్నాయి. 1962 ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ను తొలిసారి ప్రవేశపెట్టాక ఒకేసారి భారత్‌కు రెండు సింగిల్స్‌ పతకాలు రానుండటం ఇదే తొలిసారి.

ఇప్పటివరకు సింగిల్స్‌లో లభించిన ఒకే ఒక్క కాంస్య పతకం 1982 ఆసియా క్రీడల్లో దివంగత సయ్యద్‌ మోదీ పురుషుల సింగిల్స్‌లో అందించాడు. ఆ తర్వాత భారత్‌కు సింగిల్స్‌ విభాగంలో పతకం రావడం ఇదే ప్రథమం.  ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైనా 21–18, 21–16తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో ర్యాంకర్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందగా... ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు 21–11, 16–21, 21–14తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది.

హాకీ సెమీస్‌లో భారత్‌
డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్లు దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో సెమీఫైనల్‌కు చేరింది. పూల్‌ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–3తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (1వ ని.లో), చింగ్లెన్‌సనా సింగ్‌ (4వ ని.లో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (15వ ని.లో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (49వ ని.లో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (55వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు