సైనా, సింధు పరాజయం

18 Oct, 2014 01:22 IST|Sakshi
సైనా, సింధు పరాజయం

ఒడెన్స్: మరోసారి ‘చైనా' అడ్డంకిని అధిగమించడంలో విఫలమైన సైనా నెహ్వాల్... ఆటలో నిలకడలేని పి.వి.సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించారు. ఈ ఇద్దరితోపాటు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్ 20-22, 15-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది.

సైనా వరుసగా రెండో ఏడాది డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సింధు 23-25, 20-22తో నాలుగో సీడ్ జీ హున్ సుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో సింధు 18-15తో ముందంజ వేసినా, ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. ఈ దశలో ఆధిక్యం ఇద్దరితో దోబూచులాడినా తుదకు జీ హున్ సుంగ్ గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలకదశలో సింధు తడబడి పరాజయాన్ని ఖాయం చేసుకుంది.

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-23, 17-21తో ఏడో సీడ్ వాన్ హో సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ 20-15తో ఆధిక్యంలో ఉన్నదశలో ఐదు గేమ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. రెండో గేమ్ ఆరంభంలో శ్రీకాంత్ 5-1తో ముందంజ వేసి, ఆ తర్వాత వెనుకబడి ఇక కోలుకోలేకపోయాడు.

మరిన్ని వార్తలు