సైనా, సింధు శుభారంభం 

26 Apr, 2018 01:17 IST|Sakshi

శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్‌  

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

వుహాన్‌ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)లోనూ భారత క్రీడాకారులు సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్‌ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–14, 21–19తో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)పై, సైనా 21–12, 21–9తో యో జియా మిన్‌ (సింగపూర్‌)పై అలవోకగా గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 13–21, 21–16, 21–16తో కెంటా నిషిమోటో (జపాన్‌)పై, సాయిప్రణీత్‌ 21–13, 11–21, 21–19తో అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)పై, ప్రణయ్‌ 21–15, 19–21, 21–19తో కాంతాఫోన్‌ (థాయ్‌లాండ్‌)పై కష్టపడి నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21–23, 17–21తో చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 14–21, 16–21తో బొదిన్‌ ఇసారా–నిపిట్‌ఫోన్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన–పూర్వీషా రామ్‌ (భారత్‌) జోడీ 14–21, 22–20, 21–17తో ఓంగ్‌ రెన్‌నె–వోంగ్‌ యింగ్‌ క్రిస్టల్‌ (సింగపూర్‌) ద్వయంపై గెలిచింది.   నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో గావో ఫాంగ్‌జి (చైనా)తో సైనా; చెన్‌ జియోజిన్‌ (చైనా)తో సింధు; వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (వియత్నాం)తో శ్రీకాంత్‌; చెన్‌ లాంగ్‌ (చైనా)తో సాయిప్రణీత్‌; వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)తో ప్రణయ్‌ ఆడతారు.    

మరిన్ని వార్తలు