సైనాకు అనారోగ్యం.. స్విస్‌ ఓపెన్‌ నుంచి ఔట్‌

14 Mar, 2019 11:02 IST|Sakshi

బాసెల్‌(స్విట్జర్లాండ్‌): అనారోగ్యం కారణంగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనా అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లిన సైనాకు కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సైనా పోస్ట్‌ చేశారు.

‘ఇది నిజంగానే నాకు చేదు వార్త. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అన్నాశయ సంబంధిత సమస్యగా చెప్పారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా’ అని సైనా అని తెలిపారు.

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కశ్యప్‌ 21-19, 21-17తో ఫెలిక్స్‌ బ్యూరెస్‌డెట్‌ (స్వీడన్‌)పై, శుభాంకర్‌ 21-19, 21-17తో లుకాస్‌ క్లియర్‌బౌట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరారు.

మరిన్ని వార్తలు