సైనా... కాంస్యంతో సరి

1 May, 2016 02:06 IST|Sakshi

సెమీస్‌లో పరాజయం
వుహాన్ (చైనా): తన చిరకాల ప్రత్యర్థి యిహాన్ వాంగ్ చేతిలో 11వ సారి ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 16-2, 14-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుస గేముల్లో ఓడించిన ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీస్‌లో మాత్రం ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. గతంలో యిహాన్‌పై నాలుగుసార్లు నెగ్గిన సైనా తొలి గేమ్‌లో ఒకదశలో 9-6తో ముందంజలో ఉంది.

అయితే యిహాన్ పుంజుకొని రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అటునుంచి సైనా తేరుకోలేకపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా కాంస్య పతకం నెగ్గడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి సైనాకు కాంస్య పతకం దక్కింది. ఈ ఈవెంట్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా సైనా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు