విజయంతో ముగిస్తా!

3 Dec, 2019 00:48 IST|Sakshi

ఇటీవలి ఓటములు స్వయంకృతం

ప్రపంచ చాంపియన్‌గా ఒత్తిడి లేదు

‘సాక్షి’తో పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు గత ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఆమె గెలుపు గ్రాఫ్‌ అనూహ్యంగా పడిపోయింది. చైనా–1000, కొరియా, డెన్మార్క్, ఫ్రెంచ్, చైనా–750, హాంకాంగ్‌... ఇలా వరుసగా ఆరు టోర్నీల్లో ఆమె విఫలమైంది. కనీసం ఒక్కదాంట్లోనూ సింధు సెమీస్‌ కూడా చేరలేకపోయింది. అయితే ఈ పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేస్తూ 2019ని ఘనంగా ముగించాలని ఆమె పట్టుదలగా ఉంది. ప్రతిష్టాత్మకమైన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో విజయం సాధించేందుకు సింధు శ్రమిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టూర్‌ ఫైనల్స్‌లో సింధు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. అదే వేదికపై ఈ సారి డిసెంబర్‌ 11 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. వరుస వైఫల్యాలతో పాయింట్లపరంగా వెనుకబడినా... ప్రపంచ చాంపియన్‌ హోదాలో సింధు నేరుగా ఈ ఈవెంట్‌కు అర్హత సాధించింది. ఇటీవలి పరాజయాలతో తన ఆత్మ స్థయిర్యం దెబ్బ తినలేదని, మళ్లీ పట్టుదలగా ఆడి పెద్ద విజయం సాధిస్తానని సింధు చెబుతోంది. ‘సాక్షి’కి సింధు ఇచ్చిన ఇంటర్వూ్య విశేషాలు ఆమె మాటల్లోనే...

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సన్నాహాలు బాగా సాగుతున్నాయి. గత టోర్నీ తర్వాత రెండు వారాలకు పైగా సమయం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. నా ఆటలో కనిపించిన కొన్ని లోపాలు, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నా. మహిళా సింగిల్స్‌ కోచ్‌ కిమ్‌ జి హ్యూన్‌ వెళ్లిపోయిన తర్వాత మరో కొరియా కోచ్‌ పార్క్‌ కూడా నా శిక్షణలో ప్రత్యేక సహకారం అందిస్తున్నారు. ఫైనల్స్‌ టోర్నీలో ఎప్పుడైనా గట్టి పోటీ ఉంటుంది. అగ్రశ్రేణి షట్లర్లు మాత్రమే ఉంటారు కాబట్టి ప్రతీ మ్యాచ్‌ కీలకమే.

ప్రపంచ చాంపియన్‌ను అనే ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అది అతి విశ్వాసంగా మారిపోవద్దు. ప్రతీసారి ఆట మారిపోతుంది కాబట్టి కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సిందే. మన బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు సిద్ధమై వస్తారు కాబట్టి నేను కూడా అదే స్థాయిలో సన్నద్ధం కావాల్సిందే. ఉదాహరణకు నా బలం స్మాష్‌. ఆ షాట్‌ను నేను సమర్థంగా వాడాలి. అది సరిగా పని చేయకపోతే కష్టం. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత నా ప్రదర్శన బాగా లేదనేది వాస్తవం.

అందులో ఎక్కువ భాగం ప్రత్యర్థి బలంకంటే నా స్వయంకృతమే ఉంది. సునాయాసంగా పాయింట్లు రావాల్సిన చోట కూడా నేను కోల్పోయాను. ఇక్కడ నేను అనుకున్న స్ట్రోక్‌లు విఫలం కావడంతో ప్రత్యర్థులు మానసికంగా పైచేయి సాధించారు. ఆ సమయంలో కొంత ఆత్మ రక్షణలో పడిపోతాం. అదే వరుసలో పరాజయాలు వచ్చాయి. ఆటలో గెలుపోటములు సహజమే కానీ వరల్డ్‌ చాంపియన్‌ కావడంతో కొంత ఉదాసీనత కారణంగా ఓడానంటే మాత్రం అంగీకరించను. ఇటీవలి పరాజయాలతో నేను నిరాశ చెందిన మాట వాస్తవమే కానీ వాటితో నా ఆత్మ విశ్వాసం దెబ్బ తినదు. ఎందుకంటే నేను ఎప్పుడో అలాంటి దశను దాటి వచ్చేశాను.

ఇలాంటి ఓటములతో కుంగిపోతే కష్టం. నేను మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ఎన్ని గెలిచినా మన ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఫైనల్స్‌లో టైటిల్‌ నిలబెట్టుకోగలననే నమ్మకం ఉంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి ఇప్పటి వరకు నా ఆటకు సంబంధించి వీడియోలు చూసి కోచ్‌లతో ఎన్నో విషయాలు చర్చించాను. వాటిని సరిగ్గా విశ్లేషిస్తూ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌పై దృష్టి పెట్టాను. ఇక కొంత మంది అనామక ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం చాలా మంది అదోలా చూస్తున్నారు. కానీ నేను కూడా కెరీర్‌ ఆరంభంలో అలాంటి సంచలన విజయాలు సాధించినదాన్నే కదా. ఆ అమ్మాయిలు కూడా ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వారికి అనుకూలంగా ఫలితం దక్కింది.

సింధులాంటి అత్యుత్తమ స్థాయి ప్లేయర్లు మళ్లీ కోలుకొని చెలరేగడం పెద్ద సమస్య కాదు. టోర్నీల షెడ్యూలింగ్‌ కఠినంగా ఉండటం కూడా ఆమె ఓటమికి కారణాల్లో ఒకటిగా భావిస్తున్నా. ఓడినా కూడా కొన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. గత రెండు నెలలు సింధుకు కలిసి రాలేదు కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న కఠోర సాధనను బట్టి చూస్తే మళ్లీ తన స్థాయి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.
– పుల్లెల గోపీచంద్, భారత చీఫ్‌ కోచ్‌
 

మరిన్ని వార్తలు