సోషల్‌ మీడియాకు దూరంగా ధోని..

5 Jun, 2020 09:08 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా క్రికెట్‌ టోర్నీలు నిలిచిపోవడంతో భారత ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ‌ మైదానంలో తమ ఫ్యాన్స్ మిస్సవుతున్న వినోదాన్ని సోషల్‌ మీడియా వేదికగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్‌ వీడియో చాట్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలతో ఫ్యాన్స్‌కు కావాల్సిన వినోదపు విందును భారత క్రికెటర్లు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత చర్చనీయాంశమైన ఆటగాడు ఎంఎస్‌ ధోని.  ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ విషయాలు ప్రస్తావనకు వచ్చిన ప్రతీసారి ధోని భవిత్యంపై అందరూ చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య ధోని రిటైర్మెంట్‌ తీసకున్నాడనే వార్తతో పాటు, ట్విటర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్రెండ్‌ అయింది. (ధోని.. నా హెలికాప్టర్‌ షాట్లు చూడు!)

అయినప్పటికీ ఈ వార్తలపై ధోని స్పందించలేదు. అసలు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టక కొన్ని నెలలు కావస్తుంది. అయితే ధోని సోషల్‌ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నకు ధోని సతీమణి సాక్షి బదులిచ్చారు.  సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే సాక్షి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రజెంటర్ రూపా రమణి నిర్వహించిన లైవ్ సెషన్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ధోని సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను తెలిపారు. 

‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడంతోనే ధోని సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారు. దేశంలో ప్రధానికి మించిన వారు ఎవరు లేరని భావించి సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడటంలేదు. కరోనాపై వీడియోలు చేయాలని ధోనీపై చాలా మంది ఒత్తిడి చేశారు. కానీ వాటన్నింటిని ధోని సున్నితంగా తిరస్కరించారు. ధోనిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను కానీ అతను సోషల్‌ మీడియాను చాలా తక్కువగా వాడతారు. అతని ప్రొఫైల్‌ చూస్తే మీకే అర్థమవుతుంది’ అని సాక్షి వివరించారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబంతో కలిసి ధోని సరదాగా గడుపుతున్నాడు. ధోని, కూతురు జీవాకు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలను సాక్షి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. (‘ధోనిని మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు