ఒకే జట్టులో సాక్షి, సత్యవర్త్‌

17 Dec, 2016 00:17 IST|Sakshi
ఒకే జట్టులో సాక్షి, సత్యవర్త్‌

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2 ఆటగాళ్ల వేలం
జనవరి 2 నుంచి ఆరంభం
యోగేశ్వర్‌ దత్‌ దూరం
బజరంగ్‌కు అత్యధిక మొత్తం


న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్‌ సాక్షి మలిక్‌తో పాటు తన కాబోయే భర్త సత్యవర్త్‌ కడియన్‌ ఇద్దరూ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్లు్యఎల్‌) రెండో సీజన్‌ కోసం శుక్రవారం జరిగిన వేలంలో వీరిద్దరిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. సాక్షికి రూ.30 లక్షల ధర పలకగా... సత్యవర్త్‌ను రూ.18 లక్షలకు తీసుకుంది. తొలి సీజన్లో సాక్షి ముంబై జట్టుకు ఆడగా... సత్యవర్త్‌ ఉత్తర ప్రదేశ్‌కు ఆడాడు. అలాగే భారత్‌ నుంచి స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అత్యధిక ధర పలికాడు. అతడిని ఢిల్లీ జట్టు రూ.38 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే సందీప్‌ తోమర్‌ (హరియాణా, రూ.31 లక్షలు), రీతూ ఫోగట్‌ (జైపూర్, 36 లక్షలు), గీతా ఫోగట్‌ (ఉత్తర ప్రదేశ్, రూ.16 లక్షలు)లకు కూడా మంచి ధర పలికింది. అయితే జనవరి 16న వివాహం చేసుకోబోతున్న భారత స్టార్‌ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు.

ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఐదు విభిన్న వేదికల్లో జరిగే ఈ లీగ్‌ వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతుంది. రియోలో స్వర్ణం సాధించిన వ్లాదిమిర్‌ ఖించెగష్వి (జార్జియా) అత్యధిక ధర పలికిన రెజ్లర్‌గా నిలిచాడు. తనను టీమ్‌ పంజాబ్‌ జట్టు రూ.48 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఆ తర్వాత లండన్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మగోమెడ్‌ కుర్బనలీవ్‌ (అజర్‌బైజాన్‌)ను కూడా పంజాబ్‌ రూ.47 లక్షలకు తీసుకుంది. 200కు పైగా రెజ్లర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ప్రతీ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లు (ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఉండగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా