ఇంగ్లండ్‌కు మూలస్తంభం

7 Nov, 2016 00:22 IST|Sakshi
ఇంగ్లండ్‌కు మూలస్తంభం

పదేళ్ల క్రితం.... నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్‌‌సలో పాత వీసీఏ స్టేడియం... 21 ఏళ్ల యువ క్రికెటర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఎదురుగా కుంబ్లే, హర్భజన్ లాంటి దిగ్గజాలు. స్పిన్‌కు అనుకూలించే పిచ్. మహా మహా దిగ్గజాలు అనుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లు వెనుదిరుగుతున్నారు. కానీ ఆ కుర్రాడు మాత్రం గోడలా నిలబడ్డాడు. తొలి ఇన్నింగ్‌‌సలో అర్ధసెంచరీ, రెండో ఇన్నింగ్‌‌సలో అజేయ సెంచరీ... మ్యాచ్ డ్రా అరుుంది. భారత్ గెలుపును అడ్డుకున్న ఆ క్రికెటర్ పేరు అలిస్టర్ కుక్.

కట్ చేస్తే... ఇప్పుడు భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ జట్టు సారథి కుక్. ఇంగ్లండ్ తరఫున టెస్టులకు సంబంధించి అన్ని రికార్డులూ తనవే. అత్యధిక మ్యాచ్‌లు, పరుగులు, సెంచరీలు... ఇలా టెస్టు క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే దేశం తరఫున అతనో సూపర్ స్టార్. ఈ పదేళ్లలో ఎంతోమంది జట్టులోకి వచ్చారు. వెళ్లారు. కానీ కుక్ మాత్రం మూలస్తంభంలా నిలబడ్డాడు.
 
బంగ్లాదేశ్‌తో తాజాగా జరిగిన రెండు టెస్టుల ద్వారా ఇంగ్లండ్ తరఫున బ్యాటింగ్‌లో ఉన్న టెస్టు రికార్డులన్నీ దాదాపుగా కుక్ వశమై పోయారుు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును ఆ పర్యటనలో అధిగమించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో గూచ్, అథర్టన్, ్ట్రాస్ ఇలా ఎంతో మంది దిగ్గజ ఓపెనర్లు ఉన్నారు. వారందరి రికార్డులను అధిగమించాడు కుక్. ఫ్లింటాఫ్, పీటర్సన్, బోథమ్... ఇలా ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఆ జట్టుకు ఆడినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్ నుంచి వచ్చిన అత్యుత్తమ క్రికెటర్ కుక్ అని ఇప్పటికే కితాబు అందుకున్నాడు.
 
సంగీతంతో మొదలై...
చిన్నప్పుడు కుక్‌కు సంగీతం అంటే పిచ్చి. స్కూల్‌లో ప్రతి కార్యక్రమంలోనూ తనే. కేవలం ఎండాకాలం సెలవుల్లో మాత్రమే క్రికెట్ ఆడేవాడు. అందుకే తను స్కూల్ తుది జట్టులో కూడా లేడు. ఒకసారి ఎంసీసీకి చెందిన స్కూల్ జట్టు కుక్ స్కూల్‌కి వచ్చింది. ఎంసీసీ జట్టులో ఒక పిల్లాడు రాకపోతే... ప్రత్యర్థి తుది జట్టులో అవకాశం లేని కుక్‌ను తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో తను సెంచరీ చేశాడు. అప్పుడు తన వయసు 11 ఏళ్లు. అంతే ఆ ఒక్క మ్యాచ్‌తో తన రాత మారిపోరుుంది. నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలోకి వచ్చాడు. స్కూల్ స్థారుులో సంచలన ఆటతీరుతో క్రమంగా కౌంటీలకు ఆడాడు. అక్కడి నుంచి జాతీయ జట్టుకు వచ్చాడు. నిజానికి భారత్ పర్యటనకు వచ్చే ఇంగ్లండ్ జట్టు కొత్త వాళ్లని తీసుకురావడం అరుదు. కానీ 2006లో సీనియర్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో కుక్‌ను తీసుకొచ్చారు. అరంగేట్రంలోనే అదరగొట్టి సత్తా చాటిన కుక్ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏనాడూ జట్టుకు దూరం కాలేదు. ఈ పదేళ్ల కాలంలో కుక్‌కు జోడీగా దాదాపు 20 మంది క్రికెటర్లు వచ్చారు. కానీ తను మాత్రం ఒక ఎండ్‌లో కుదురుగా అలా ఉండిపోయాడు.
 
2010 నుంచి అత్యుత్తమం
 కెరీర్ ప్రారంభమైన తొలి నాలుగు సంవత్సరాలు కుక్ అందరిలో ఒకడిగానే కనిపించాడు. అడపా దడపా ఓ సెంచరీతో తన స్థానాన్ని కాపాడుకోవడానికే పరిమితమయ్యాడు. 2010లో తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో తను చెలరేగిపోయాడు. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో ఏకంగా 766 పరుగులు చేసి ఒంటిచేత్తో సిరీస్‌ను గెలిపించాడు. 24 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయం సాధించలేకపోరుున ఇంగ్లండ్... కుక్ పుణ్యమా అని నెగ్గింది. దీంతో దేశం మొత్తం సంబరాలు జరిగారుు. కుక్‌కు లండన్‌లో ‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ’ గౌరవం ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది భారత్‌పై 294 పరుగులు చేసి కెరీర్‌లో అత్యత్తమ స్కోరు సాధించాడు. ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో నంబర్‌వన్ కావడంలో కుక్‌దే కీలక పాత్ర. 2012లో ఆండ్రూ ్ట్రాస్ రిటైర్ అరుున తర్వాత పూర్తి స్థారుులో ఇంగ్లండ్ పగ్గాలు కుక్‌కు అప్పగించారు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో భారత్‌ను భారత్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. 1984 తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం అదే తొలిసారి. 2013లో స్వదేశంలో జరిగిన యాషెస్‌లోనూ జట్టును విజయపథంలో నడిపించాడు. కానీ ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియాలో సిరీస్‌ను 1-4తో ఓడిపోయారు. అరుుతే జట్టులోని సీనియర్ క్రికెటర్లు చాలామంది రిటైరైన సమయం అది. యువ క్రికెటర్లతో ఫలితాలను తేవడానికి సమయం పడుతుందంటూ ఈసీబీ కుక్‌కు వెన్నంటి నిలిచింది. 2014 వరకు కుక్ ఇంగ్లండ్‌కు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కొనసాగినా... వన్డేల్లో సాధారణ ఆటతీరు కారణంగా తనపై వేటు పడింది. 2015లో తిరిగి స్వదేశంలో యాషెస్ సిరీస్ గెలిపించాడు.
 
దిగ్గజాల సరసన చోటు

ఇంగ్లండ్ ప్రజల పండుగ క్రిస్‌మస్ రోజు జన్మించిన కుక్ ఆ దేశ క్రికెట్ దిగ్గజాల సరసన ఇప్పటికే చేరాడు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, విజ్‌డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ ఇలా కుక్ అనేక ఘనతలు సాధించాడు. క్రికెట్‌కు తను అందించిన సేవలు, సాధించిన ఘనతల పట్ల సంతోషించిన బ్రిటన్ రాణి కుక్‌ను ‘ఆర్డర్ ఆఫ్ ద అంపైర్’ గా గౌరవించారు. తను సాధించిన ఘనతల పట్ల కుక్ చాలా గర్వపడ్డాడు. ‘ఇంగ్లండ్ తరఫున దశాబ్దకాలం పైగా క్రికెట్ ఆడే అవకాశం లభించడం నా అదృష్టం. నా కెరీర్‌లో జట్టు విజయానికి ఉపయోగపడిన ప్రతిసారీ గర్వంగా భావించేవాడిని. నా దృష్టిలో ఇంగ్లండ్ జాతీయ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం లేదు. దీనిని కాపాడుకుంటాను. నాలో శక్తి ఉన్నంతవరకూ ఆడుతూ ఇంగ్లండ్ క్రికెట్‌లో కొత్త ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తాను’ అని కుక్ చెబుతున్నాడు.
 
 సచిన్ రికార్డులే లక్ష్యం
 ప్రస్తుత తరంలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కుక్ ఒకడు. తన వయసు 31 సంవత్సరాలు. మరో పదేళ్ల పాటు తను క్రికెట్ ఆడగలడని అంచనా. ప్రస్తుతం మిస్బావుల్ హక్ 40 ఏళ్ల వయసులోనూ నిలకడగా ఆడుతున్నాడు. దీనికి తోడు కుక్ కేవలం టెస్టులకే పరిమితం. కాబట్టి మరో పదేళ్లు ఆడటం కష్టం కాకపోవచ్చు. సచిన్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లలో 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. కుక్ ఇప్పటికి 135 మ్యాచ్‌లలో 29 సెంచరీలతో 10,688 పరుగులు చేశాడు.

ప్రస్తుతం కుక్ సగటున ప్రతి 29 రోజులకు ఒక టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. అంటే సుమారుగా ఏడాదికి 12 టెస్టులు. అంటే సచిన్ మ్యాచ్‌లను చేరడానికి తనకు సుమారు ఆరేళ్లు పడుతుంది. ఆరేళ్ల పాటు ఇంతే నిలకడగా ఆడితే సచిన్ పరుగుల రికార్డును చేరుకోవచ్చు. కానీ సెంచరీలను అందుకోవడం కొద్దిగా కష్టమే. ఏమైనా సచిన్ రికార్డులను కుక్ అందుకోవాలనే ఆశ అతనొక్కడిదే కాదు... టెస్టు క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఆ దేశానిది కూడా. మరి ప్రాక్టికల్‌గా ఇది సాధ్యమవుతుందో లేదో తెలుసుకోవాలంటే మరో ఐదారేళ్లు ఆగాల్సిందే.

-సాక్షి క్రీడావిభాగం

మరిన్ని వార్తలు