కావాలంటే పిచ్‌ మార్చగలను!

26 Oct, 2017 00:35 IST|Sakshi

బుకీలకు పుణే క్యురేటర్‌ భరోసా

టీవీ ఆపరేషన్‌లో పట్టుబడ్డ సాల్గావ్‌కర్‌

క్యురేటర్‌పై బీసీసీఐ వేటు 

పుణే: భారత క్రికెట్‌లో ‘ఫిక్సింగ్‌’ వివాదం ఇప్పుడు ఆటగాళ్లను దాటి పిచ్‌ క్యురేటర్ల దాకా చేరింది! స్థాయికి తగినట్లుగా బ్యాటింగ్, బౌలింగ్‌ చేయకుండా మ్యాచ్‌లను ఫిక్సింగ్‌ చేసిన ఉదంతాలు గతంలో ఉండగా... మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించే విధంగా ‘పిచ్‌’లో మార్పులు చేసి కూడా ఫిక్సింగ్‌ చేయవచ్చని కొత్తగా తేలింది!  పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) స్టేడియం పిచ్‌ క్యురేటర్‌ పాండురంగ సాల్గావ్‌కర్‌ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాడు. జాతీయ వార్తా ఛానల్‌ ‘ఇండియా టుడే టీవీ’ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఇది బయటపడింది. చానల్‌ కథనం ప్రకారం... భారత్, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డేకు ముందు రోజు తమను తాము బుకీలుగా పరిచయం చేసుకొని రిపోర్టర్లు సాల్గావ్‌కర్‌తో ముచ్చటించారు. పుణే పిచ్‌పైనే నిలబడి క్యురేటర్‌ వారి ప్రశ్నలకు సందేహాస్పద రీతిలో సమాధానాలిచ్చారు. ‘మీరు కోరిన విధంగా పిచ్‌లో మార్పులు చేసేందుకు నేను సిద్ధం’ అని 68 ఏళ్ల సాల్గావ్‌కర్‌ చెబుతున్నట్లుగా అందులో రికార్డయింది. ‘ఇక్కడ ఉన్న ఎనిమిదో నంబర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కనీసం 337 పరుగులు చేయవచ్చు. ఆపై దానిని ఛేదించవచ్చు కూడా’ అని సాల్గావ్‌కర్‌ వీడియోలో చెప్పాడు. మరో వీడియో క్లిప్‌లో వేరే క్యురేటర్లు చూస్తున్నారు, జాగ్రత్త అని రిపోర్టర్లను హెచ్చరించినట్లుగా ఉంది. ఇతర క్లిప్‌లలో ఒక చోట పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలిస్తుందని, మరో చోట ‘ఫలానా’ ఆటగాడికి మరింత బాగా సరిపోతుంది కాబట్టి అతనిపై బెట్టింగ్‌ చేయవచ్చని క్యురేటర్‌ అభయం ఇస్తున్నట్లుగా ఉంది.  

బీసీసీఐ చర్యలు... ఐసీసీ విచారణ
న్యూస్‌ ఛానల్‌లో ‘పిచ్‌ ఫిక్సింగ్‌’ వార్తలు రాగానే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెంటనే చర్యలు తీసుకుంది. ముందు పాండురంగ సాల్గావ్‌కర్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లుగానే ప్రకటించిన బోర్డు, ఆ తర్వాత కొద్ది సేపటికే పూర్తిగా అతడిని డిస్మిస్‌ చేసింది. బోర్డు పిచెస్‌ కమిటీ సభ్యుడైన రమేశ్‌ మామున్‌కర్‌కు ప్రత్యేకంగా పిచ్‌ బాధ్యతలు అప్పజెప్పడంతో హడావిడిగా మ్యాచ్‌ కోసం మైదానాన్ని సిద్ధం చేశారు. దీనికి ఐసీసీ ఆమోదముద్ర కూడా వేయడంతో మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. బీసీసీఐ ఇప్పటికే చర్యలు తీసుకున్నా...తాజా ఘటనకు సంబంధించి ఐసీసీ, ఎంసీఏ కూడా తమ వైపు నుంచి ప్రత్యేక విచారణ జరపాలని నిర్ణయించాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌పై ఆసీస్‌ ఘన విజయం సాధించిన తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా పుణే పిచ్‌ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం.  

టాంపరింగ్‌ సాధ్యమా!  
టీవీ ఛానల్‌ కథనం ప్రకారం చూస్తే పిచ్‌ను తమకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చని అనిపిస్తున్నా... ఈ విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటల్లో మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, ఇది ఏ మాత్రం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. ‘వాతావరణ పరిస్థితులు కలిసొస్తేనే క్యురేటర్‌ ఎంతో కొంత ప్రభావం చూపించగలరు. లేదంటే నెల రోజుల్లో కూడా కావాల్సినట్లుగా తయారు చేయడం ఎవరి వల్లా కాదు. సాల్గావ్‌కర్‌ ఊరికే అబద్ధాలు చెబుతున్నాడు’ అని ఒక బీసీసీఐ క్యురేటర్‌ కుండబద్దలు కొట్టాడు. ‘ఒక్క రోజులో బుకీలకు అనుకూలంగా అతను పిచ్‌ను ఎలా మారుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. అతను ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పాడో తెలీదు’ అని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే క్యురేటర్లకు సాధారణంగా తక్కువ జీతభత్యాలు ఉంటాయి కాబట్టి వారు బుకీల వలలో పడే అవకాశం ఉంటుందని కూడా మాజీ క్యురేటర్‌ వెంకట్‌ సుందరమ్‌ చెప్పారు. బీసీసీఐ క్యురేటర్లకు ప్రస్తుతం వారి అనుభవాన్ని బట్టి రూ. 35 వేల నుంచి రూ. 70 వేల వరకు జీతాలు ఉన్నాయి. మరోవైపు ఛానల్‌ తమ కథనంలో రిపోర్టర్లు బుకీలుగా పరిచయమయ్యారని చెప్పుకున్నా... వీడియోలో ఆ విషయం మాత్రం ఎక్కడా లేదు.  

భారత్‌కు ఆడకపోయినా...
పాండురంగ సాల్గావ్‌కర్‌ 70వ దశకంలో భారత్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. శ్రీలంకతో ఒకసారి అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొన్నా... ఎప్పుడూ భారత్‌ తరఫున ఆడే అవకాశం రాలేదు. సత్తా ఉన్న పేస్‌ బౌలర్‌ అయి ఉండీ దురదృష్టవశాత్తూ భారత్‌కు ఆడలేకపోయాడంటూ సునీల్‌ గావస్కర్‌ తన ఆటోబయోగ్రఫీలో కూడా సాల్గావ్‌కర్‌ గురించి ప్రత్యేకంగా రాశారు. 63 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో సాల్గావ్‌కర్‌ కేవలం 26.70 సగటుతో 214 వికెట్లు పడగొట్టడం విశేషం. పాండురంగ ప్రస్తుతం క్యురేటర్‌ హోదాలో ఎంసీఏ నుంచి రూ. 65 వేల జీతంతో పాటు బీసీసీఐ నుంచి పెన్షన్‌ కూడా పొందుతున్నారు.

మరిన్ని వార్తలు