భారత స్టార్స్‌కు చుక్కెదురు

8 Aug, 2019 05:55 IST|Sakshi

రెండో రౌండ్‌లోనే ఓడిన టాప్‌–3 సీడెడ్‌ ఆటగాళ్లు సమీర్‌ వర్మ, ప్రణయ్, సాయిప్రణీత్‌

సాక్షి, హైదరాబాద్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్, సాయిప్రణీత్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ సమీర్‌ వర్మ 18–21, 11–21తో హియో క్వాంగ్‌ హీ (కొరియా) చేతిలో... రెండో సీడ్‌ సాయిప్రణీత్‌ 17–21, 23–21, 15–21తో లియోనార్డో రుంబే (ఇండోనేసియా) చేతిలో... మూడో సీడ్‌ ప్రణయ్‌ 17–21, 10–21తో జియా వె తాన్‌ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, సౌరభ్‌ వర్మ, శుభాంకర్‌ డే ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు.

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ కశ్యప్‌ 23–21, 19–21, 21–17తో క్వాలిఫయర్‌ కిమ్‌ డాంగ్‌హున్‌ (కొరియా)పై, శుభాంకర్‌ 19–21, 21–13, 21–16తో సెంగ్‌ జో యో (మలేసియా)పై గెలిచారు. హైదరాబాద్‌ ఆటగాడు, క్వాలిఫయర్‌ చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ తొలి రౌండ్‌లో 21–16, 21–23, 15–21తో మరో క్వాలిఫయర్‌ బాయ్‌ యు పెంగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.
మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–14, 17–21, 21–10తో దిశా గుప్తా (అమెరికా)పై గెలుపొందగా... గుమ్మడి వృశాలి 16–21, 10–21తో ఫితాయపోర్న్‌ చైవన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ 15–21, 10–21తో కి జుయ్‌ఫె (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.  

మరిన్ని వార్తలు