సెమీస్‌లో సైనా, సమీర్‌ వర్మ

24 Nov, 2018 00:54 IST|Sakshi

లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్‌ మోదీ స్మారక వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌లో సైనా సెమీ ఫైనల్‌ చేరింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనా 21–19, 21–14తో రితూపర్ణ దాస్‌ (భారత్‌)పై గెలిచింది. మరో క్వార్టర్‌ ఫైనల్లో తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజితా రావు 9–21, 21–19, 12–21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ (చైనా) చేతిలో ఓటమి పాలైంది.  

సమీర్‌ వర్మ దూకుడు... 
పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ ముందంజ వేయగా... పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్‌ క్వార్టర్స్‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు. క్వార్టర్స్‌లో సమీర్‌ వర్మ 21–18, 16–21, 21–11తో హు జెకీ (చైనా) పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. కశ్యప్‌ 16–21, 19–21తో సిథికోమ్‌ థమాసిన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... సాయి ప్రణీత్‌ 10–12, 21–19, 14–21తో లు గాంగ్జూ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి జంట 15–21, 21–19, 21–17తో ఓయూ జూన్‌యై–రెన్‌ జియాంగ్యూ (చైనా) జోడీపై గెలిచి సెమీస్‌ చేరింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19–21, 21–8, 21–18తో తానియా కుసుమ–వానియా సుకోకొ (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి సెమీస్‌ చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జంట సెమీస్‌లో అడుగుపెట్టింది.    

మరిన్ని వార్తలు