ముంబై రాకెట్స్‌ బోణీ 

26 Dec, 2017 00:17 IST|Sakshi

ఢిల్లీ డాషర్స్‌పై 4–1తో గెలుపు

ప్రపంచ 15వ ర్యాంకర్‌పై  సమీర్‌ వర్మ సంచలన విజయం

గువాహటి: రెండు ‘ట్రంప్‌’ మ్యాచ్‌ల్లో గెలిచిన ముంబై రాకెట్స్‌ జట్టు ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో శుభారంభం చేసింది. ఢిల్లీ డాషర్స్‌తో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌ 4–1 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్‌ డే–తాన్‌ బూన్‌ హెంగ్‌ (ముంబై) ద్వయం 14–15, 15–14, 15–10తో వ్లాదిమిర్‌ ఇవనోవ్‌–సొజోనోవ్‌ (ఢిల్లీ) జంటపై గెలిచి 1–0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ సమీర్‌ వర్మ 15–11, 15–12తో ప్రపంచ 15వ ర్యాంకర్, హాంకాంగ్‌ ప్లేయర్‌ వింగ్‌ కీ వోంగ్‌ విన్సెంట్‌ (ఢిల్లీ)పై గెలిచాడు. ఇది ఢిల్లీకి ‘ట్రంప్‌’ మ్యాచ్‌ కావడంతో ఆ జట్టు స్కోరు –1గా మారగా... ఒక పాయింట్‌ పొందిన ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుంగ్‌ జీ హున్‌ 12–15, 15–14, 15–9తో బీవెన్‌ జాంగ్‌ (ముంబై)ను ఓడించింది. దాంతో ఢిల్లీ స్కోరు 0–2గా మారింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో తియాన్‌ హువె (ఢిల్లీ) 13–15, 15–13, 15–9తో సన్‌ వాన్‌ హో (ముంబై) గెలుపొందడంతో ఢిల్లీ ప్రత్యర్థి జట్టు ఆధిక్యాన్ని 1–2కి తగ్గించింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గాబ్రియేలా స్టొఇవా–లీ యోంగ్‌ డే (ముంబై) జంట 15–11, 15–9తో ప్రణవ్‌ చోప్రా–ఆరతి సారా (ఢిల్లీ) జోడీపై గెలిచింది. ఇది ముంబై ‘ట్రంప్‌’ మ్యాచ్‌ కావడం, ఆ జట్టే నెగ్గడంతో వారికి రెండు పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ముంబై 4–1తో ఢిల్లీని ఓడించింది. ఒకవేళ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉంటే 2–1తో విజయాన్ని ఖాయం చేసుకునేది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ తలపడుతుంది.    

మరిన్ని వార్తలు