ఆసియా చాంప్‌ సామియా

9 Oct, 2017 00:14 IST|Sakshi

పసిడి సాధించిన హైదరాబాదీ

ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌  

యాంగూన్‌ (మయన్మార్‌): అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ వేదికపై మరో భారత అమ్మాయి మెరిసింది. ఈసారి జూనియర్‌ విభాగంలో ఆసియాను జయించి మువ్వన్నెల పతాకం రెపరెపలాడించింది. ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన సామియా ఇమాద్‌ ఫారుఖీ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన అండర్‌–15 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సామియా (భారత్‌) 15–21, 21–17, 21–19తో విడ్జజా స్టెఫాని (ఇండోనేసియా)పై నెగ్గి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 14 ఏళ్ల సామియా తుదికంటా పట్టుదలగా పోరాడి విజేతగా నిలిచింది. ఇప్పటివరకు ఇదే విభాగం సింగిల్స్‌లో జాతీయ స్థాయిలో ఒక్క పతకాన్ని కూడా గెలవని సామియా ఏకంగా ఆసియా టైటిల్‌ను అందుకొని చరిత్ర సృష్టించింది. కఠినంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలిగేమ్‌ ఆరంభం నుంచే ఇండోనేసియా ప్రత్యర్థి స్టెఫాని 6–1తో ఆధిక్యం ప్రదర్శించింది. ఇదే జోరులో 21–15తో స్టెఫాని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో పుంజుకున్న సామియా 6–2తో ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ 13–8తో జోరు ప్రదర్శించింది.

ఈ దశలో తేరుకున్న స్టెఫాని వరుసగా 5 పాయింట్లు సాధించి 13–13తో స్కోరును సమం చేసింది. తర్వాత ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దూకుడుగా ఆడిన సామియా 21–17తో రెండోగేమ్‌ను గెలిచి రేసులో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సామియా వెనుకబడింది. వెంటవెంటనే పాయింట్లు సాధిస్తూ స్టెఫాని 11–7తో ముందంజ వేసింది. ఈ దశలో సంయమనంతో ఆడిన సామియా 12–16తో కొంత తేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి వరుసగా 4 పాయింట్లు సాధించి 16–16తో స్కోరు సమం చేసింది. ఈ దశలో ఇరువురూ హోరాహోరీగా పోరాడటంతో 18–18 వద్ద మళ్లీ స్కోరు సమమైంది. ఒత్తిడిని జయించిన సామియా వరుసగా రెండు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత స్టెఫాని ఒక పాయింట్‌ సాధించడంతో పోరు రసవత్తరంగా మారింది. చివరకు ఎలాంటి తడబాటు లేకుండా సామియా మరో పాయింట్‌ సాధించి 21–19తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌ స్వర్ణంతో పాటు 3 కాంస్య పతకాలను సాధించింది. 

మరిన్ని వార్తలు