ఆసియాకప్‌ కన్నా వెస్టిండీస్‌ టూర్‌ ముఖ్యమా?

15 Sep, 2018 16:59 IST|Sakshi
సందీప్‌ పాటిల్‌, రవిశాస్త్రి, కోహ్లి

భారత సెలక్టర్లపై మాజీ సెలక్టర్‌ పాటిల్‌ ఫైర్‌

ముంబై: ఆసియాకప్‌ టోర్నీకి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంపై భారత సెలక్టర్లను మాజీ క్రికెటర్‌, సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ తప్పుబట్టాడు. వెస్టిండీస్‌ పర్యటన కన్నా ఈ టోర్నీ ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కాలమ్‌లో భారత్‌.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుందని, ఈ మ్యాచ్‌ భారత అభిమానుల సెంటిమెంట్‌కు సంబంధించినదని పేర్కొన్నారు.

‘ఓ మాజీ క్రికెటర్‌గా.. సెలక్టర్‌గా బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లపై ఉన్న ఒత్తిడి గురించి నాకు తెలుసు. కానీ కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేసి విండీస్‌ పర్యటనకు విశ్రాంతి ఇవ్వాల్సింది. ఆసియాకప్‌లో భారత్‌ పాక్‌ను ఢీకొట్టనుంది. ఇది యావత్‌ భారత ప్రజానీకానికి ప్రత్యేక మ్యాచ్‌. భావోద్వేగంతో కూడుకున్న మ్యాచ్‌. రెండు జట్లు తమ బెస్ట్‌ ప్లేయర్స్‌తో బరిలోకి దిగాలి. కానీ కోహ్లికి విశ్రాంతివ్వడం బాలేదు. ఇక సెలక్టర్లకు ఏ టోర్నీకి ప్రాధాన్యమో ఇవ్వాలో అన్న విషయం తెలియాలి. ముఖ్యంగా ఏ టోర్నీలో ఏ ఆటగాళ్లను బరిలోకి దింపాలి. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలో తెలిసుండాలి.  వెస్టిండీస్‌పై గెలవడం కన్నా ఆసియాకప్‌ గెలవడమే ముఖ్యం. 30 మంది ఆటగాళ్లు బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్నప్పుడు కోహ్లి ఒక్కడిపైనే ఎందుకు ఒత్తిడి పడుతోంది. అందరికి సమానంగా అవకాశాలు ఇవ్వాలి. రోహిత్‌ శర్మకు అంతగా సమయం లేదు. జట్టు కూర్పుపై, వ్యూహాలపై అతనే త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి.’ అని పాటిల్‌ అభిప్రాయపడ్డాడు. 

మరిన్ని వార్తలు