సలామ్ సంగ

11 Aug, 2015 00:18 IST|Sakshi
సలామ్ సంగ

భారత్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్న సంగక్కర
 రెండో టెస్టే ఈ దిగ్గజానికి ఆఖరిది

 
అతనో పరుగుల యంత్రం. దశాబ్దం న్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నె ముక. పోరాట యోధుడు. సహచరులంతా పెవిలియ న్‌కు క్యూ కడుతున్నా, ఆఖరి బంతి వరకు అభిమా నుల ఆశలను నిలబెట్టడానికి పోరాడతాడు. అందుకే సంగక్కర బ్యాటింగ్ అంటే శ్రీలంక ఊగిపో తుంది. ప్రత్యర్థులు ఒకటికి రెండుసార్లు వ్యూహాలను సరిచూసుకుంటారు. అలాంటి దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పబోతున్నాడు. ఇప్పటికే వన్డేల నుంచి తప్పుకున్న సంగ... భారత్‌తో రెండో టెస్టు తర్వాత పూర్తిగా రిటైర్ కాబోతున్నాడు.
 
క్రీడావిభాగం  సంగక్కరకు పరుగుల దాహం ఎక్కువ. అతను టెస్టుల్లో చేసిన 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడమే దీనికి నిదర్శనం. ఓ మైలురాయిని దాటగానే చాలా మంది క్రికెటర్లలా సంబరపడిపోడు. మరింత బాధ్యతగా ఆడతాడు. ఈ లక్షణమే అతణ్ని శ్రీలంక క్రికెట్‌లో ‘ఆల్‌టైమ్ గ్రేట్’ లలో ఒకడిగా నిలబెట్టింది. నిజానికి సంగక్కరలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. 37 ఏళ్ల వయసులో 2014లో అతను అసాధారణంగా పరుగులు చేశాడు. 72 సగటుతో ఏకంగా 1438 టెస్టు పరుగులు సాధించాడు. అందుకే అతను మిగిలిన ఫార్మాట్ల నుంచి రిటైరైనా టెస్టుల్లో మాత్రం కొనసాగాలని శ్రీలంక బోర్డు విజ్ఞప్తి చేసింది. అయినా అతను అంగీకరించలేదు.
 
నిస్వార్థుడు...

తన కెరీర్‌లో సంగక్కర ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్లని పట్టించుకోలేదు. సొంత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేశాడు. అందుకే రిటైర్‌మెంట్ విషయంలోనూ ఎవరి మాటా వినలేదు. నిజానికి తను ఏడాది క్రితమే రిటైర్ అవ్వాలనుకున్నాడ ట. బోర్డుకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలపాలని భావించాడు. అయితే అనుకోకుండా అదే సమయంలో జయవర్ధనే రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఆ విషయాన్ని మహేళ తొలుత సంగక్కరకే చెప్పాడట. దీంతో సంగక్కర తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. ‘ఒకేసారి ఇద్దరు సీనియర్ క్రికెటర్లు తప్పుకుంటే జట్టుపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మహేళ నిర్ణయం వినగానే నేను ఓ ఏడాది ఆడాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పడం శ్రీలంక క్రికెట్ గురించి అతనెంత ఆలోచిస్తాడో చెప్పడానికి ఉదాహరణ.

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ (15921) తర్వాత ఉన్న ముగ్గురూ 13 వేల పైచిలుకు పరుగులు చేశారు. ప్రస్తుతం సంగక్కర ఖాతాలో 12,305 పరుగులు ఉన్నాయి. మరో రెండేళ్లు క్రికెట్ ఆడితే సచిన్‌ను అధిగమించకపోయినా... సచిన్‌కు చేరువలోకి వస్తాడు. ఈ జాబితాలో రెండో స్థానానికి చేరతాడు. అలాగే ఒక్క డబుల్ సెంచరీ కొడితే బ్రాడ్‌మన్ సరసన నిలుస్తాడు. ఈ రికార్డులేవీ తనని ఊరించలేదు. ‘ఓ రెండేళ్లు ఆడితే మహా అయితే మరికొన్ని రికార్డులు వస్తాయి. కానీ వాటికోసం నా కెరీర్‌ను పొడిగించుకోవడం అర్థంలేని విషయం. నేను పూర్తిస్థాయిలో నా జట్టుకు న్యాయం చేసే సత్తాతో ఆడగలనా లేదా అనే విషయం నాకే ఎక్కువగా తెలుస్తుంది. నా సహచరుల కళ్లలోకి ధైర్యంగా చూస్తూ మాట్లాడేలా నా ఆట ఉండాలి. కాబట్టి ఇప్పుడు రిటైర్ కావడమే సరైన నిర్ణయం’ అన్న సంగక్కర మాటలు తనెంత గొప్పగా ఆలోచిస్తాడో చెప్పడానికి నిదర్శనం.
 
మార్కు చూపిస్తాడా!
 తను వెళ్లే ముందు తన మార్కును చూపించడం సంగకు అలవాటు. టి20 ఫార్మాట్‌కు టైటిల్  సాధించి వీడ్కోలు చెప్పాడు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. తన ఆఖరి టోర్నీ ప్రపంచకప్‌లో వరుస మ్యాచ్‌లలో ఈ నాలుగు శతకాలు చేయడం విశేషం. త నలో ఇంకా చాలా సత్తా ఉందనడానికి ఇది నిదర్శనం. అలాగే టెస్టుల నుంచి కూడా తన మార్కు చూపించే వెళతాడు. మరో రెండు డబుల్ సెంచరీలు కొడితే డాన్ బ్రాడ్‌మన్ (12) రికార్డును అధిగమిస్తాడు. రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు కొట్టడం తేలికేం కాదు. అయితే అది సంగక్కర లాంటి యోధుడికి అసాధ్యం కూడా కాదు. తన చివరి టెస్టు సిరీస్‌ను చిరస్మరణీయంగా మలచుకోవాలని సంగ కోరుకోవడంలో తప్పు లేదు. అటు శ్రీలంక జట్టు సహచరులు కూడా తమ దిగ్గజం కోసం భారత్‌తో తొలి రెండు టెస్టులు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!
 
 భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం
 రిటైర్‌మెంట్ తర్వాత సంగక్కర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. కౌంటీలు, ఐపీఎల్ లాంటి టోర్నీలు తను ఇంకా ఆడే అవకాశం ఉంది. అయితే స్వదేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించగల సత్తా తనలో ఉందని, బోర్డు అనుమతిస్తే ఆ బాధ్యతలు తీసుకుంటానని అంటున్నాడు. మరోవైపు తన ప్రియ మిత్రుడు జయవర్దనేతో కలిసి ఇప్పటికే ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. ఇద్దరి భాగస్వామ్యంలో మరిన్ని వ్యాపారాలు రాబోతున్నాయి.
 

మరిన్ని వార్తలు