అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు

29 May, 2020 10:41 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఆ మధుర క్షణాలు అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాయి. కులశేఖర్‌ బౌలింగ్‌లో ధోని సిక్సర్‌ కొట్టిన వెంటనే యువీ ఆనందంతో ధోనిని హత్తుకునే ఉద్వేగభరిత దృశ్యాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. కానీ యువీ, ధోనిలు సంబరాలు జరుపుకుంటే అక్కడే వికెట్ల వెనకాల ఉన్న కుమార సంగక్కర చిరునవ్వును చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ, ఓటమిని అంగీకరిస్తూ గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. దీనికి లంక అభిమానులతో సహా, యావత్‌ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్‌ చేసింది. ఈ క్రమంలో అలాంటి బాధాకర సమయంలో కూడా తన ముఖంపై చిరునవ్వుకు గల కారణాలను సంగక్కర తాజాగా వెల్లడించారు. 

‘30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను (ప్రపంచకప్‌-2011 సమయాని​కి). మేము ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. కొన్ని పరిస్థితులు మమ్మల్ని కిందికి నెట్టేశాయి. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇలా అనేక సమస్యలు వచ్చాయి. కానీ శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్థితిస్థాపకత. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వ స్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్‌ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాము. గెలుపు కోసమే బరిలోకి దిగుతాం, రెండు కోట్ల మంది ప్రజల ముఖాలపై చిరునవ్వు కోసం ఆడతాం, పోరాడుతాం. గెలుపోటములు సహజం. కానీ ఓటమిని జీర్ణించుకొని తరువాతి మ్యాచ్‌ కోసం త్వరగా సన్నద్దమవుతాం. (ప్రపంచకప్‌-2011 ఫైనల్‌: రెండుసార్లు టాస్‌)

1996 తర్వాత మరోసారి ప్రపంచకప్‌ గెలవడానికి 2007, 2011లో అదేవిధంగా 2009,2012 (టీ20 ప్రపంచకప్‌)లో అవకాశం వచ్చింది. ఫైనల్‌ మెట్టుపై ఓడిపోయాం. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌ మమ్మల్ని ఎక్కువగా బాధించింది. మంచి టీం, మంచి స్కోర్‌ సాధించాం, ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాం అయినా ఓడిపోయాం. అయితే కొన్ని సార్లు ఇలాంటివి సంభవిస్తాయి. ఇప్పుడు ఓడిపోయాం. అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటామా? లేక వచ్చే ప్రపంచకప్‌ కోసం సన్నద్దం కావాలా? మా ఆలోచన కూడా అంతే. మా ఆటగాళ్లకు కూడా ఎప్పుడూ ఒకటి చెబుతుంటా. ఎక్కువ ఎమోషన్‌గా ఉండకూడదని, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్‌గా‌ ఉంటే తమను తాము నియంత్రించుకోలేరు’ అంటూ సంగక్కర వివరించారు. (ధోనికి ఆ హక్కు ఉంది)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా