సానియా జోడీ జైత్రయాత్రకు బ్రేక్

26 Feb, 2016 12:00 IST|Sakshi
సానియా జోడీ జైత్రయాత్రకు బ్రేక్

దోహా: ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్ లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ లో సానియా మిర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) 2-6, 6-4, 10-5 తేడాతో రష్యా ద్వయం ఎలినా వెస్నినా- డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 13 టోర్నమెంట్లలో ఓటమనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్-స్విస్ జోడీకి పెద్ద షాక్ తగిలింది.

1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు(28) గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్న సానియా-హింగిస్ ద్వయం, 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించే క్రమంలో కేవలం కొన్ని అడుగులదూరంలో(41 విజయాలు) వెనుదిరిగారు. దీంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ లో అత్యధిక వరుస విజయాల రికార్డులో మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. కాగా, మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983- 85 మధ్య కాలంలో మార్టినా నవ్రతిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది.
 

>
మరిన్ని వార్తలు