అదే జోరు... అదే ఫలితం

4 Oct, 2015 06:53 IST|Sakshi
అదే జోరు... అదే ఫలితం

సానియా-హింగిస్ జంటకు ఏడో డబుల్స్ టైటిల్
వుహాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఇండో-స్విస్ ద్వయం
రూ. 84 లక్షల 98 వేల ప్రైజ్‌మనీ సొంతం

 
న్యూఢిల్లీ: వేదిక మారినా... ప్రత్యర్థి కొత్త వారైనా... అదే జోరు... అదే సమన్వయం... ఆఖరికి అదే ఫలితం... వెరసి భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా తన స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో శనివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీపై విజయం సాధించింది.
     
గంటా తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడానికి శ్రమించాయి. ఫలితంగా మ్యాచ్ మొత్తంలో ఐదు సర్వీస్ బ్రేక్‌లు నమోదయ్యాయి. సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
     
మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయిన సానియా-హింగిస్ జంట ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. అయితే కీలకదశలో పాయింట్లు నెగ్గి ఫలితాన్ని శాసించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు లక్షా 30 వేల 300 డాలర్ల (రూ. 84 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్‌లో సానియా మొత్తం 10 టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకోగా... ఎనిమిదింటిలో విజేతగా నిలిచింది. హింగిస్‌తో కలిసి ఏడు... బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఒక టైటిల్‌ను ఈ హైదరాబాద్ అమ్మాయి కైవసం చేసుకుంది. ఓవరాల్ కెరీర్‌లో సానియాకిది 30వ టైటిల్. మరోవైపు హింగిస్‌కిది 48వ టైటిల్.  గత 13 మ్యాచ్‌ల్లో సానియా-హింగిస్ జంట ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఆదివారం ఆరంభమయ్యే చైనా ఓపెన్‌లో సానియా-హింగిస్ జంటకు టాప్ సీడింగ్ లభించింది.
 
ప్రతి మ్యాచ్‌లో మేమిద్దరం మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. అందుకే వరుస సెట్‌లలో మ్యాచ్‌లను గెలుస్తున్నాం. కోర్టు లోపల, కోర్టు బయట మేమిద్దం మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. క్లిష్ట సమయాల్లో పరస్పరం విశ్వసిస్తాం. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి.
 -సానియా మీర్జా
 

>
మరిన్ని వార్తలు