సానియా వస్తోంది! 

1 Jan, 2020 03:33 IST|Sakshi

హోబర్ట్‌ ఓపెన్‌తో పునరాగమనం

రెండేళ్ల తర్వాత బరిలోకి

న్యూఢిల్లీ: భారత సంచలన టెన్నిస్‌ స్టార్‌గా వెలుగువెలిగిన హైదరాబాదీ సానియా మీర్జా మళ్లీ బరిలోకి దిగేందుకు రాకెట్‌ పట్టింది. ఓ పండంటి కుమారుడికి తల్లయ్యాక కూడా తనలో టెన్నిస్‌ ఆడే తపన తగ్గలేదని చెబుతోంది. ఆట కోసం ఏదో ఆదరబాదరగా సిద్ధమైపోలేదు. ప్రసవం వల్ల సహజంగానే ఆమె కాస్తా లావెక్కారు. బరిలో దిగడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సీనియర్‌ డబుల్స్‌ ప్లేయర్‌ ఓ క్రమపద్ధతిలో కసరత్తులు చేసింది. రోజు 5 గంటలపాటు ట్రెయినింగ్‌లో చెమటోడ్చింది. జనవరికి ముందే ఇలా లక్ష్యాన్ని పెట్టుకున్న హైదరాబాదీ స్టార్‌ 4 నెలలు క్రమం తప్పకుండా శ్రమించి  ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది. టెన్నిస్‌ ఫిట్‌నెస్‌కు సరిపోయే క్రీడాకారిణిగా మారింది.

2017లో చైనా ఓపెన్‌ ఆడుతున్న సమయంలో మోకాలు గాయంతో ఆటకు దూరమైన సానియా తదనంతరం గర్భం దాల్చడంతో పూర్తిగా రాకెట్‌ను అటక ఎక్కించింది. తనకిష్టమైన టెన్నిస్‌ తనకు దూరమైన బాధ కలుగుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ రెండేళ్లు టీవీల్లో కూడా టెన్నిస్‌ మ్యాచ్‌లు చూడలేదని చెప్పింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ సాధించిన సానియా ఒకానొక దశలో ప్రపంచ నంబర్‌వన్‌ డబుల్స్‌ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 11 నుంచి జరిగే డబ్ల్యూటీఏ హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొంటుంది. మహిళల డబుల్స్‌లో నదియా కిచెనక్‌ (ఉక్రెయిన్‌)తో మిక్స్‌డ్‌లో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగనుంది.

‘నేను మళ్లీ రాకెట్‌ పట్టడానికి ప్రధాన కారణం... నేను టెన్నిస్‌ ఆడటం, గెలవటం, పోటీపడటం వీటన్నింటిని మిస్‌ అవుతున్నానన్న భావన నన్ను నన్నులా ఉండనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే గత రెండేళ్లుగా నా కిట్‌ను పక్కన బెట్టేశాను. నేను అనుకున్న ఫలితాలు సాధించాననే తృప్తితో ఉన్నాను. అయితే అప్పుడే నాలో ఇంకా టెన్నిస్‌ ఆడే సత్తా మిగిలే ఉందని అనిపించింది. ఇలా అనిపించడం వల్లే మళ్లీ బరిలోకి రాగలుగుతున్నాను’ అని వివరించింది. పెళ్లితో ఓ గృహిణిగా మారాక తనలో ఎన్నో మార్పులొచ్చేవని... ఇక నా ఆట నా నుంచి పూర్తిగా దూరమవుతుందనే బెంగకూడా ఉండేదని సానియా చెప్పింది.

మరిన్ని వార్తలు