16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?

4 May, 2016 13:12 IST|Sakshi
16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?

హైదరాబాద్/న్యూఢిల్లీ: పట్టుమని పదహారేళ్లైనా నిండకముందే టెన్నిస్ ప్లేయర్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది సానియా మిర్జా. ఏ రేంజ్ లో కష్టపడితే అంత చిన్నవయసులోనే అంత పేరు సాధించిందామె? ఆ దిశగా ఇన్ స్పైర్ చేసింది ఎవరు? అన్నింటికన్నా మించి, స్టార్ గా ఎదిగిన తర్వాత కెరీర్ ను నిలబెట్టుకోగలగడం, పాకిస్థానీతో పెళ్లి విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే మెంటల్ బ్యాలెన్స్ ఎలా సాధించింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జులైలో సమాధానాలు తెలియనున్నాయి. సానియా మిర్జా బయోగ్రఫీ 'ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్' ను జులైలో విడుదల చేయనున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ బుధవారం వెల్లడించింది.

'దాదాపు గుర్తెరిగినప్పటి నుంచి చేతిలో టెన్నిస్ రాకెట్ మాత్రమే పట్టుకున్న సానియా దాన్ని పక్కన పెట్టి మొదటిసారి పెన్ పట్టుకుని, తండ్రి ఇమ్రాన్ మిర్జా సహకారంతో ఆత్మకథ రాశారు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అడ్డంకులు, వాటిని అధిగమించిన తీరు, సాధించిన విజయాల వెనుక రహస్యాలు.. అన్నీ పుస్తకంలో రాసినట్లు, భవిష్యత్ లో క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి ఇన్ స్పిరేషనల్ బుక్ గా రూపొందించినట్లు సానియా చెప్పారు. ఇండియా నంబర్ వన్ మాత్రమేకాదు.. వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సానియా ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేసే అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నమని, జులై నుంచి అన్ని పుస్తక దుకాణాల్లో 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' అందుబాటులో ఉంచుతామని హూపర్ కొలిన్స్ (ఇండియా) చీఫ్ ఎడిటర్ కార్తిక అన్నారు. ఈ పుస్తకం ఆధారంగా సానియా జీవితంపై ఓ సినిమా కూడా రూపొందించాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు