బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీతో సానియా పునరాగమనం

14 Nov, 2019 02:10 IST|Sakshi

ముంబై: భారత మహిళల టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వచ్చే ఏడాది జనవరిలో బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీతో అంతర్జాతీయ సర్క్యూట్‌లో పునరాగమనం చేయనుంది. గత ఏడాది అక్టోబర్‌లో బాబు ఇజ్‌హాన్‌కు జన్మనిచ్చిన సానియా రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ఇటీవల మళ్లీ రాకెట్‌ పట్టిన ఈ హైదరాబాద్‌ స్టార్‌ వారంలో ఆరు రోజులపాటు ప్రాక్టీస్‌ చేస్తోంది. మహిళల, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన సానియా మహిళల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా కూడా నిలిచింది.

జనవరిలో బ్రిస్బేన్‌ ఓపెన్, హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నీల్లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నదియా కిషెనోక్‌తో కలిసి ఆడనున్న 33 ఏళ్ల సానియా ఆ తర్వాత సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో కూడా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం రోజూ ఉదయం నాలుగైదు గంటలు ప్రాక్టీస్‌ చేస్తున్న సానియా సాయంత్రం వేళలో జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. ‘పునరాగమనంలో కొత్తగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా ఆడతాను. నా టెన్నిస్‌ కెరీర్‌లో కోరుకున్న విజయాలన్నీ సాధించాను. భవిష్యత్‌లో సాధించే విజయాలన్నీ బోనస్‌లాంటివే’ అని సానియా వ్యాఖ్యానించింది

మరిన్ని వార్తలు