సెకండ్‌ ఇన్నింగ్స్‌ బోనస్‌ మాత్రమే

2 Aug, 2019 08:31 IST|Sakshi

పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వ్యాఖ్య  

న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్‌కు పర్యాయ పదంగా నిలిచిన హైదరాబాదీ స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా మళ్లీ కోర్టులో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. అమ్మతనం కారణంగా రెండేళ్లు ఆటకు దూరమైనా... టెన్నిస్‌పై ఏమాత్రం ప్రేమ తగ్గలేదని పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకుతో సహా మరెన్నో ఘనతలు సాధించిన ఆమె... ఇకపై వచ్చేవన్నీ బోనస్‌ మాత్రమేనని అంటోంది. వచ్చే ఏడాది జనవరిలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తానంటున్న సానియా అంతరంగం ఆమె మాటల్లోనే....  

ఎక్కువే సాధించా.. 
ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌లో నేను చాలా సాధించా. ఇన్ని ఘనతలు సొంతం చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. డబుల్స్‌లో సుదీర్ఘ కాలం ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకుతో పాటు ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ అందుకోవ డం చిన్న విషయమేం కాదు. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ను కూడా సాధించా. 

కొత్తగా నిరూపించుకోవాల్సిందేం లేదు 
తల్లినయ్యాక ఈ ఏడాది ఆగస్టులోనే మళ్లీ రాకెట్‌ పట్టాలనుకున్నా. కానీ అది కుదరలేదు. వచ్చే ఏడాది జనవరిలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాల నుకుంటున్నా. అది జరిగితే అద్భుతమే. ఇప్పుడు నేను కొత్తగా ఏదో నిరూపించుకోవాల్సిందేం లేదు. ఏది సాధించినా అది బోనస్‌ మాత్రమే. ఆటపై ప్రేమతో మాత్రమే పునరాగమనం చేయాలనుకుంటున్నా.  

పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే... 
బిడ్డకు జన్మనిచ్చాక ముందులా ఫిట్‌నెస్‌ అందుకోవడం అంత సులువేం కాదు. ఫిట్‌నెస్‌ కోసమే శ్రమిస్తున్నా. దానికి మరికొంత సమయం పడుతుందేమో. మరో రెండు నెలల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుంది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాకే పోటీలో పాల్గొంటా. ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడి పునరాగమనం చేసి గాయాల పాలవడంలో అర్థం లేదు.  

సెరెనానే స్ఫూర్తి... 
ఇప్పటివరకు తల్లి అయ్యాక కొందరు మాత్రమే ఆటలో అనుకున్న స్థాయిలో రాణిం చారు. మార్గరెట్‌ కోర్ట్, ఎవోన్‌ గూలాగాంగ్, కిమ్‌ క్లయ్‌ స్టర్స్‌ బిడ్డకు జన్మనిచ్చాక కూడా గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచారు. ఈ తరం లో అతి కొద్ది మంది మాత్రమే ఇలా చేయగలుగుతున్నారు. వారిలో సెరెనా ఒకరు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలనుకునే క్రీడాకారులకు సెరెనా స్ఫూర్తిగా నిలుస్తుంది.  

మోకాలి గాయం ఇంకా బాధిస్తోంది 
2017లో నేను ఆటకు దూరమయ్యే సమయంలో నే మోకాలి గాయమైంది. అది ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఇలాగే బరిలో దిగి మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోలేను. ప్రతిరోజు 4 గంటలు జిమ్‌లో గడుపుతున్నా. ఇప్పుడు 26 కేజీల బరు వు తగ్గాను. ఇంకా ఫిట్‌గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వాలంటే నాకు ఇంకా సమయం కావాలి. 

లక్ష్యమేం లేదు 
ప్రస్తుతానికి పునరాగమనం చేయడమే నా ఆశ. అంతకుమించి ఏదో సాధించాలంటూ పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు. నాపై అంచనాలు ఉంటాయనే సంగతి తెలుసు కానీ రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాక ఒక అథ్లెట్‌గా ఎంత సాధిస్తానో చూడాలి. పునరాగమనం విజయవంతం అయితే నా దృష్టి టోక్యో ఒలింపిక్స్‌పై సారిస్తా.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు