అన్నింటా నిరాశే...

15 Aug, 2016 02:19 IST|Sakshi
అన్నింటా నిరాశే...

చేతులెత్తేసిన సానియా-బోపన్న జంట  
 కాంస్య పతక పోరులో పరాజయం

 
 రియో డి జనీరో: తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడినా మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (భారత్) జంటకు నిరాశ తప్పలేదు. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో నాలుగో సీడ్ సానియా-బోపన్న ద్వయం 1-6, 5-7తో లూసీ హర్డెకా-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో భారత జంట తడబడింది. ఒత్తిడిలో ఆడుతున్నట్లు కనిపించిన సానియా-బోపన్న సులువుగా రావాల్సిన పాయింట్లను కూడా సాధించలేకపోయారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన సానియా-బోపన్నలు తొలి సెట్‌ను 27 నిమిషాల్లో చేజార్చుకున్నారు.
 
  రెండో సెట్‌లో భారత జంట కాస్త తేరుకున్నట్లు కనిపించింది. 3-1తో ఆధిక్యంలో ఉన్న దశలో తమ సర్వీస్‌ను కోల్పోయిన సానియా జంట ఆ తర్వాత 11వ గేమ్‌లోనూ సర్వీస్‌ను చేజార్చుకుంది. 12వ గేమ్‌లో చెక్ రిపబ్లిక్ ద్వయం తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తంలో సానియా-బోపన్న జోడి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 13 అనవసర తప్పిదాలు చేసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో సానియా-బోపన్న జోడి 6-2, 2-6, 3-10తో ‘సూపర్ టైబ్రేక్’లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.
 
 రిక్త హస్తాలతో షూటర్లు
 గత మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు అందించిన షూటింగ్ క్రీడాంశంలో ఈసారి భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఏకంగా 12 మంది పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకాన్ని సాధించలేకపోయారు. ఆదివారం జరిగిన చివరిదైన ఈవెంట్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో చెయిన్ సింగ్, గగన్ నారంగ్ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. క్వాలిఫయింగ్‌లో చెయిన్ సింగ్ 1169 పాయింట్లతో 23వ స్థానంలో... గగన్ నారంగ్ 1162 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచారు.
 

మరిన్ని వార్తలు