హర్మన్‌.. పొవార్‌ అవసరం లేదు : మంజ్రేకర్‌

5 Dec, 2018 19:22 IST|Sakshi
హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌

ముంబై : మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు. కోచ్‌గా అతనికిచ్చిన గడువు గత నెల 30వ తేదీతో ముగిసిపోవడంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే టీ20 మహిళా ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్‌తో వివాదం కారణంగా పొవార్‌ మళ్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేవనే వాదన వినిపించింది. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని కూడా అందరూ భావించారు. కానీ టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌,  వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానలు పొవార్‌కు మద్దతుగా నిలవడంతో కథ మొదటికి వచ్చింది. అతడి ఆధ్వర్యంలో జట్టు మెరుగ్గా ఆడిందని కోచ్‌గా మరికొంత కాలం కొనసాగించాలని వీరిద్దరు బోర్డుకు లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అయితే ఈ లేఖలపై మంజ్రేకర్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘పొవార్‌ కోచ్‌గా లేని సమయంలో కూడా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. దాదాపు టైటిల్‌ గెలిచినంత పనిచేసింది. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్‌ గుర్తు తెచ్చుకోవాలి. పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి తీసేస్తే, అక్కడి నుంచి కొత్తగా మొదలు పెట్టాలి. అంతేగాని కోచ్‌ పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోకూడదు’ అని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ఇక మిథాలీ అభిమానులు సైతం హర్మన్‌ ప్రీత్‌, స్మృతి మంధానలపై మండిపడుతున్నారు. పోవార్‌ వల్లే భారత మహిళలు ప్రపంచకప్‌ గెలిచే అవకాశం కోల్పోయారని, అటువంటి కోచ్‌ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక కోచ్‌ పొవార్‌ తనను ఎంతగానో అవమానించాడని మిథాలీ రాజ్‌ బీసీసీఐకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 

చదవండి: కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర‍్మన్‌ లేఖ
ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ

మరిన్ని వార్తలు