‘ధోని హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది’

13 May, 2019 19:40 IST|Sakshi

డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ధోని సేనపై అద్భుత రికార్డు ఉన్న ముంబై అదే జోరును కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో కప్‌ను ఎగురేసుకుపోయింది. కచ్చితంగా గెలిచి నాలుగోసారి ఐపీఎల్‌ టైటిల్‌ దక్కించుకుంటుందని భావించిన చెన్నై జట్టు ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమ జట్టు చేసిన తప్పులే తమకు ట్రోఫీని దూరం చేశాయంటూ చెన్నై సారథి ధోని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరు జట్లు తప్పిదాలు చేశాయని, తమ కంటే ఒక తప్పిదం తక్కువ చేయడం వల్లే ప్రత్యర్థి జట్టు విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు.

కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమిని ధోని తట్టుకోలేకపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు.‘మ్యాచ్‌ తర్వాత నా గుండె ధోనితో మాట్లాడటం మొదలుపెట్టింది. కేవలం ఒకే ఒక్క పరుగుతో టైటిల్‌ కోల్పోవడం తన హార్ట్‌ను బ్రేక్‌ చేసింది. ధోని ఇంతలా బాధపడటం ఇంతకు ముందెన్నడు చూడలేదు’ అని పేర్కొన్నాడు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో ఆట అంత గొప్పగా ఏమీలేదనీ, అయినా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహం కచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చాంపియన్‌ బౌలర్లు ఉన్న జట్టునే విజయం వరించే అవకాశాలు ఎక్కువ. క్రికెట్‌ ప్రేమికులకు వినోదాన్ని పంచే ఐపీఎల్‌ చిరకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. కాగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్‌ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు