ఫేక్ ఫీల్డింగ్ నిబంధనపై మంజ్రేకర్ ధ్వజం

6 Oct, 2017 14:45 IST|Sakshi

న్యూఢిల్లీ:ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ లోని పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.అందులో 'ఫేక్' ఫీల్డింగ్ నిబంధన ఒకటి. బ్యాట్స్ మన్ ను ఫీల్డర్ పక్కతోవ పట్టించే యత్నం చేస్తే అది ఫేక్ ఫీల్డింగ్ కిందికి వస్తుంది. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా జేఎల్టీ వన్డే కప్ లో క్వీన్ లాండ్స్ బుల్స్ -క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా ఎలెవన్ బ్యాట్స్ మన్ పరామ్ ఉప్పల్ బంతిని మిడాఫ్ మీదుగా తరలించాడు. కాగా,  మార్నస్ లాబుస్కాంజ్ బంతిని ఆపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కాగా, ఆ క్రమంలో చేతిలో బంతి ఉన్నట్లు బ్యాట్స్ మన్ ను భ్రమించే యత్నం చేశాడు. ఇది తాజా నిబంధనలకు విరుద్ధం కావడంతో సదరు జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడింది. అయితే ఐసీసీ నిబంధనల్లో మార్పులు చేసిన తరువాత దాన్ని అతి క్రమించిన తొలి క్రికెటర్ గా మార్నస్ లాబుస్కాంజ్ నిలిచాడు.

ఈ నిబంధనపై ప్రముఖ్య వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తాడు. ఇక్కడ ఐసీసీ ప్రవేశపెట్టిన ఫేక్ ఫీల్డింగ్  నిబంధన పూర్తిగా విరుద్ధం. ఇది క్రికెట్ లో ఎంతమాత్రం సరైనది కాదు. దీన్ని మరొకసారి పునః సమీక్షించాల్సి న అవసరం ఉంది'అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఒకవేళ ఫీల్డర్ కనుక బ్యాట్స్ మన్ ను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తే ఐదు పరుగులు ఇస్తున్నారు. మరి ఫీల్డర్ ను బ్యాట్స్ మన్ తప్పుదోవ పట్టించిన క్రమంలో ఏం చేస్తారో చెప్పాలంటూ ట్వీట్ల ద్వారా విమర్శలు గుప్పించాడు. ఇక్కడ సరదాగా చేసే ఆ యత్నం మోసం కిందికి రాదనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఇందుకు మహేంద్ర సింగ్ ధోనినే చక్కటి ఉదాహరణగా మంజ్రేకర్ పేర్కొన్నాడు.కొన్ని సందర్బాల్లో ధోని చేతుల్లో బంతి లేకపోయినప్పటికీ, అది తన దగ్గరే ఉన్నట్లు భ్రమింపజేసి వికెట్లపైకి విసిరే యత్నం చేసేవాడనే విషయాన్ని మంజ్రేకర్ ఈ సందర్భంగా ఉదహరించాడు. ఇలా చేయడం తప్పుకాదనే విషయం ఐసీసీ గ్రహించి దాన్ని వెంటనే సమీక్షించాలన్నాడు.


 

మరిన్ని వార్తలు