సంజిత చాను డోపీ కాదు

11 Jun, 2020 00:07 IST|Sakshi

ఐడబ్ల్యూఎఫ్‌ ప్రకటన

న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చాను డోపీ కాదని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. అమె నమూనాల్లో కచ్చితమైన ఉత్ప్రేరకాల ఆనవాళ్లు లేకపోవడంతో ఐడబ్ల్యూఎఫ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు సంజితపై మోపిన డోపింగ్‌ కేసును కొట్టివేస్తున్నాం’ అని ఐడబ్ల్యూఎఫ్‌ ఈ–మెయిల్‌లో తెలిపింది. 26 ఏళ్ల మణిపూర్‌ లిఫ్టర్‌ 53 కేజీల కేటగిరీలో 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలుపొందింది.

అయితే 2017 నవంబర్‌లో అమెరికాలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు ముందు ఆమె నుంచి నమూనాలు సేకరించారు. సంజిత నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు ఫలితం వచ్చింది. దీంతో ఆమెపై 2018 మేలో సస్పెన్షన్‌ వేటు వేశారు. దీనిపై ఆమె నిర్దోషినంటూ మొదటి నుంచి వాదిస్తూనే వచ్చింది. ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్న చాను తను ఇన్నాళ్లు పడిన మానసిక క్షోభకు ఐడబ్ల్యూఎఫ్‌ క్షమాపణలు చెప్పాలని, నష్ట పరిహారం కూడా అందజేయాలని డిమాండ్‌ చేసింది. వారి నిర్వాకం వల్ల తను టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు దూరమయ్యానని, దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారని ఆమె ఘాటుగా స్పందించింది.

మరిన్ని వార్తలు