యో-యో టెస్టులో సంజు శాంసన్ విఫలం

11 Jun, 2018 16:16 IST|Sakshi

ముంబై: ఐపీఎల్-11 సీజన్‌లో మెరుగ్గా రాణించి.. భారత-ఎ జట్టులో చోటు సంపాదించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడు.  దీంతో త్వరలో జరగనున్న ఇంగ్లండ్‌ పర్యటన నుంచి సంజు శాంసన్‌ తప్పుకోవాల్సి వచ్చింది.

జూన్ 17 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా మూడు జూనియర్‌ జాతీయ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో అతన్ని ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టు నుంచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తప్పించింది.  

భారతత-ఎ జట్టుకి శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. జట్టులో పృథ్వీ షా, శుభమన్ గిల్, రిషబ్ పంత్ తదితర యువ క్రికెటర్లకి చోటు దక్కింది. తాజాగా సంజూ శాంసన్ జట్టు నుంచి పక్కకి వెళ్లడంతో.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
 

మరిన్ని వార్తలు