సామ్సన్‌ ఎప్పుడు..!

7 Jan, 2020 00:14 IST|Sakshi

యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సొంత గడ్డపై, శ్రీలంకలాంటి జట్టుతో సిరీస్‌కంటే మించిన మంచి అవకాశం ఏదైనా ఉంటుందా! కానీ భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం అలా ఆలోచించడం లేదు. టి20 ప్రపంచకప్‌ ఏడాది వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు ఒకవైపు చెబుతున్నా... వాస్తవంలో మాత్రం అది జరగడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కేరళ ఆటగాడు సంజు సామ్సన్‌. తన కెరీర్‌లో అతను ఏకైక అంతర్జాతీయ మ్యాచ్‌ (టి20) 2015లో జింబాబ్వేతో ఆడాడు. ఆ తర్వాత దేశవాళీ, ఐపీఎల్‌లలో రాణించినా మళ్లీ అవకాశం దక్కలేదు. ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు.

అంతకు కొద్ది రోజుల క్రితం విజయ్‌ హజారే వన్డే టోర్నీలో చేసిన డబుల్‌ సెంచరీతో అతనికి ఈ గుర్తింపు లభించింది. అయితే బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌లలో అతడిని ఆడించకుండా బెంచ్‌కే పరిమితం చేశారు. తర్వాత ధావన్‌ గాయపడితే విండీస్‌తో సిరీస్‌కు మళ్లీ ఎంపిక చేశారు. రెండో మ్యాచ్‌ అతని సొంత గ్రౌండ్‌ తిరువనంతపురంలో జరిగినప్పుడైనా చాన్స్‌ వస్తుందని అంతా అనుకున్నా అది సాధ్యం కాకుండానే సిరీస్‌ ముగిసిపోయింది.

ఇప్పుడు కూడా లంకతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తుది జట్టులో లేడు. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అతను డ్రింక్స్‌కే పరిమితమయ్యాడు. దీనికంటే అతడిని విడుదల చేసి ఉంటే రంజీ ట్రోఫీ అయినా ఆడుకునేవాడు. రెండు మ్యాచ్‌లలో అతను సెంచరీ, అర్ధ సెంచరీ చేశాడు. సామ్సన్‌ రంజీ జట్టులో ఉంటే కేరళను ఓడించడం హైదరాబాద్‌కు కూడా కష్టమయ్యేది! మరో బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేది కూడా దాదాపు ఇదే పరిస్థితి. పేరుకే టి20 టీమ్‌లో రెగ్యులర్‌ అయినా అతడిని సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ కోసమే వాడుకుంటున్నట్లు అనిపిస్తోంది. గత ఏడు మ్యాచ్‌లలో ఒకేసారి అతనికి చాన్స్‌ దక్కింది.

మరిన్ని వార్తలు