కరెంట్ ఉండదు... వర్షం ఆగదు!

8 Aug, 2014 01:40 IST|Sakshi
కరెంట్ ఉండదు... వర్షం ఆగదు!

షెడ్డులోనే సాధన
 ప్రతికూల పరిస్థితుల్లోనూ సంతోషికి పతకాలు
 
 సాక్షి, విజయనగరం: ఒక పొలంలో చిన్న షెడ్డు... వర్షం పడితే నిలుచునే అవకాశం లేకుండా కారిపోతుంది. దీనికి తోడు దోమల బెడద... కరెంట్ కూడా ఉండదు. ఇదీ కామన్వెల్త్ క్రీడల్లో రజతపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి ప్రాక్టీస్ చేస్తున్న వాతావరణం. విజయనగరం జిల్లాలోని కొండవెలగాడలో ఇలాంటి ప్రతికూలతను ఎదుర్కొంటూ కూడా ఆమె అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ గ్రామంలో సంతోషితో  పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ లిఫ్టర్లు కూడా సాధన చేస్తున్నారు. ‘మాకు కనీస వసతులు కూడా లేవు. మా కోచ్ రాము సార్ పొలంలోనే షెడ్ వేసి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. లిఫ్టింగ్ సెట్లు కూడా సరైనవి లేవు. ఇతర వ్యాయామ పరికరాల గురించి అసలు ఆలోచించనేలేము’ అని సంతోషి చెప్పింది.
 
 నాలుగేళ్లుగా ఫలితాలు
 2005లో సాధన మొదలు పెట్టాక జూనియర్ స్థాయినుంచి సీనియర్ వరకు సంతోషి ఇప్పటి వరకు 13 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొంది. అయితే 2010 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన అనంతరమే ఆమెకు గుర్తింపు దక్కింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది. ‘ముందుగా కాంస్యంతోనే సంతృప్తి చెందాను. అయితే మొదటి స్థానంలో నిలిచిన అమ్మాయి డోపింగ్‌లో పట్టుబడటంతో నాకు రజతం దక్కడంతో సంతోషం రెట్టింపైంది’ అని ఆమె చెప్పింది.
 
 ఆర్థిక సమస్యలు ఉన్నా...
 సంతోషిది పేదరిక నేపథ్యం. చాలీచాలని సంపాదన ఉన్నా ఆమె తల్లిదండ్రులు ఆటల వైపు ప్రోత్సహించారు. ఇప్పుడు వారి నమ్మకాన్ని ఈ అమ్మాయి నిలబెట్టింది. ‘కుటుంబ సభ్యులతో పాటు కోచ్ రాము అండగా నిలిచారు. మరికొంత మంది దాతలు నాకు సహకారం అందించారు. ఆర్థిక ఇబ్బందుల భారం నాపై పడకుండా ప్రోత్సహించడం వల్లే ఈ రోజు కామన్వెల్త్‌లో పతకం నెగ్గగలిగాను’ అని సంతోషి భావోద్వేగంతో అంది.
 
 భవిష్యత్తుపై ఆశ
 తాజాగా కామన్వెల్త్ విజయం సంతోషిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో జరిగే ఆసియా క్రీడలతో పాటు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఒలింపిక్స్‌లో పతకమే నా లక్ష్యం. అయితే అది సులువు కాదు. దానికి కఠోర శ్రమతో పాటు ఫిట్‌నెస్‌వంటివి కూడా కీలకం. ప్రాక్టీస్‌కు అంతర్జాతీయ స్థాయి పరికరాలు అవసరం. అయితే అన్ని అడ్డంకులను అధిగమించాలని పట్టుదలగా ఉన్నా’ అని ఆమె పేర్కొంది.
 
 ప్రభుత్వం సహకరిస్తుందా..?
 నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ పతకం సాధించినా ఇప్పటిదాకా ప్రభుత్వం సంతోషిని పట్టించుకోలేదు. ‘తొమ్మిదేళ్ల క్రితమే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలిచాను. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. వేర్వేరు కార్యక్రమాల్లో నాకు ఇది చేస్తాం, అది చేస్తాం అనడమే గానీ నాయకులు, అధికారులు ఎప్పుడూ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడైనా నాకు సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాను’ అని ఈ విజయనగరం అమ్మాయి చెబుతోంది. కామన్వెల్త్ విజయం అనంతరం ఇటీవలే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ. 7.5 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. దీంతో పాటు ఆమె సాధనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే సంతోషికి ఒలింపిక్ పతకం కూడా అసాధ్యం కాబోదు.
 

మరిన్ని వార్తలు