ట్రిపుల్‌ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!

11 Jul, 2020 16:05 IST|Sakshi

ఇస్లామాబాద్‌: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముల్తాన్‌లో చేసిన ట్రిపుల్‌ సెంచరీ కంటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ చెన్నైలో చేసిన 136 పరుగులకే తాను ఎక్కువ రేటింగ్‌ ఇస్తానని పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ అన్నాడు. అలా అని తాను సెహ్వాగ్‌ రికార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదని.. అతడు ఓ గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. అయితే చెన్నైలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సచిన్‌ సెంచరీ సాధించడం గొప్ప విషయమన్నాడు. కాగా 2004లో పాకిస్తాన్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. తద్వారా పాక్‌ గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియాతో జరిగిన 1999, 2004 టెస్టు మ్యాచ్‌ల్లో పాక్‌ జట్టులో భాగమైన సక్లయిన్‌ శుక్రవారం క్రికెట్‌ బాజ్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.‘‘ వీరేంద్ర సెహ్వాగ్‌ సాధించిన ట్రిపుల్‌ సెంచరీ కంటే.. అంతకంటే ముందు అంటే 1999లో చెన్నైలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 136 పరుగులకే విలువ ఎక్కువ అని భావిస్తాను. ఎందుకంటే ఆనాడు మేం(పాక్‌ జట్టు) పూర్తిస్థాయి ప్రణాళికతో అక్కడికి వెళ్లాం. అదొక యుద్ధమనే చెప్పాలి. రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. (నా భార్యను అల్మారాలో దాక్కోమని చెప్పా)

అయితే ముల్తాన్‌(2004)లో పరిస్థితి ఇందుకు భిన్నం. అప్పుడు ఎలాంటి పోటీ లేదు. పైగా టెస్ట్‌ మ్యాచ్‌లో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ అది. అప్పుడు నాతో పాటు షోయబ్‌ అక్తర్‌ కూడా గాయపడ్డాడు. వికెట్‌ ఫ్లాట్‌గా ఉంది. బౌలర్లకు ఏమాత్రం అనుకూలించలేదు. బౌలింగ్‌ యూనిట్‌ మొత్తం చేతులెత్తేసింది. అంతేకాదు అప్పుడు బోర్డులో కూడా గందరగోళం ఉండేది. ఇంజమాముల్‌ హక్‌ అనుకోకుండా కెప్టెన్‌ అయిపోయాడు. మ్యాచ్‌పై సరిగా దృష్టి సారించలేకపోయాం. పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయాం.(‘భారత్‌లో అతడిని ఎదుర్కోవడం కష్టం’)

యాషెస్‌కు ముందు ఏడాది ముందే ప్రిపరేషన్స్‌ జరుగుతాయి కదా. అలాగే ఇండియాతో మా మ్యాచ్‌ కూడా. కానీ మేం సిద్ధంగా లేము. సెహ్వాగ్‌ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ అన్నది నిజమే. అయితే అప్పుడు పరిస్థితులు అనుకూలించినందు వల్లే ట్రిపుల్‌ సాధించాడని భావిస్తున్నా. ఎందుకంటే మనం పూర్తిగా సన్నద్ధమై.. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టినపుడే కదా మ్యాచ్‌ను ఆస్వాదించగలం. ఏదేమైనా సెహ్వాట్‌ గొప్ప బ్యాట్స్‌మెన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 2004 నాటి టెస్ట్ సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు