నాతో తప్పుగా ప్రవర్తిస్తావా అన్నాడు ..!

25 Apr, 2020 11:12 IST|Sakshi

ఆ రోజు సచిన్‌ అన్న మాటతో మళ్లీ స్లెడ్జింగ్‌ చేయలేదు: సక్లయిన్‌

కరాచీ: క్రికెట్‌లో తనదైన శకాన్ని సృష్టించుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 47వ వసంతాన్ని శుక్రవారమే పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్‌ 24వ తేదీన 48వ ఒడిలోకి అడుగుపెట్టిన సచిన్‌.. కరోనా వైరస్‌ కారణంగా తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్‌ చేసుకోలేదు. దాంతో ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సచిన్‌కు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే సచిన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని అతనితో ఒక జ్ఞాపకాన్ని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ షేర్‌ చేసుకున్నాడు. పీటీఐకి ఇచ్చిన ఫోన్‌  ఇంటర్యూలో ముస్తాక్‌ పలు విషయాల్ని పంచుకున్నాడు. దీనిలో భాగంగా సచిన్‌ను స్లెడ్జింగ్‌ చేసిన క్షణాల్ని నెమరవేసుకున్నాడు. ‘ అది 1997లో అనుకుంటా.  కెనడాలో సహారాకప్‌ జరుగుతున్న సమయం. సచిన్‌ ఎందుకో స్లెడ్జ్‌ చేయాలనిపించింది.(‘అందుకు నా పెద్దన్న కుంబ్లేనే కారణం’)

చాంపియన్‌ బ్యాట్స్‌మన్‌ను స్లెడ్జ్‌ చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నా. సచిన్‌ను స్లెడ్జింగ్‌ చేసేశాను. అలా సచిన్‌ను స్లెడ్జ్‌ చేయడం నాకు తొలిసారి. కాగా, సచిన్‌ నా వద్దకు వచ్చి నన్ను ఎందుకు స్లెడ్జ్‌ చేస్తున్నావ్‌ అని అడిగాడు. నేను ఎప్పుడూ నీతో తప్పుగా ప్రవర్తించలేదు. మరి నువ్వు నాతో​ ఎందుకు తప్పుగా ప్రవర్తించాలని అనుకున్నావ్‌ అని అన్నాడు. ఆ మాటకు నాకు ఏం చెప్పాలో తెలియలేదు.  ఏమీ మాట్లాడలేకపోయాను. కాకపోతే మ్యాచ్‌ అయిపోయిన తర్వాత సచిన్‌కు సారీ ఒక్కటే చెప్పాను. ఆ తర్వాత సచిన్‌ను ఏనాడు స్లెడ్జ్‌ చేయలేదు. అదే తొలిసారి.. చివరిసారి కూడా’ అని సక్లయిన్‌ తెలిపాడు. ఒక వ్యక్తిగా క్రికెటర్‌గా సచిన్‌ చాలా ఉన్నతస్థానంలో ఉన్నాడన్నాడు. సచిన్‌ క్రికెటింగ్‌ కెరీర్‌లో తన పేరు కూడా ఉన్నందుకు చాలా అదృష్టవంతుడినని సక్లయిన్‌ పేర్కొన్నాడు. తమ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేదన్నాడు. కొన్ని సందర్భాల్లో సచిన్‌ పైచేయి సాధిస్తే, మరికొన్ని సందర్భాల్లో తాను పైచేయి సాధించేవాడినన్నాడు. (ధోని ఇక ‘మెన్‌ ఇన్‌ బ్లూ’లో కనిపించడు..)

>
మరిన్ని వార్తలు