హాకీకి సర్దార్‌ వీడ్కోలు

13 Sep, 2018 01:11 IST|Sakshi

కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకే నిర్ణయం

12 ఏళ్లు జాతీయ జట్టుకు సేవలు  

న్యూఢిల్లీ: భారత హాకీలో మరో స్టార్‌ ప్లేయర్‌ శకం ముగిసింది. 12 ఏళ్లుగా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సర్దార్‌ సింగ్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కొత్త కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏళ్ల ఈ హరియాణా ప్లేయర్‌ వివరించాడు. హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సర్దార్‌ 2006లో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 307 మ్యాచ్‌ల్లో భారత్‌ తరఫున బరిలోకి దిగాడు. మిడ్‌ ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ... ఆటను నియంత్రిస్తూ... ఫార్వర్డ్‌ ఆటగాళ్లకు గోల్స్‌ చేసే అవకాశాలు సృష్టిస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను మధ్యలోనే తుంచేస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2008 నుంచి 2016 వరకు భారత్‌కు కెప్టెన్‌ వ్యవహరించాడు.

‘ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ హాకీ ఆడుతున్నా. ఇప్పుడు సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికి... కుర్రాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నా. కుటుంబ సభ్యులు, హాకీ ఇండియా, మిత్రులతో చర్చించాకే రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తీసుకున్నా’ అని సర్దార్‌ వివరించాడు. ‘నా నిర్ణయానికి ఫిట్‌నెస్‌ సమస్య కాదు. మరో మూడేళ్లు ఆడే ఫిట్‌నెస్‌ నాలో ఉంది. ప్రతి దానికి సమయం అంటూ ఉంటుంది కదా. హాకీకి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని భావించా’ అని సర్దార్‌ వివరించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడిన సర్దార్‌కు 2012లో ‘అర్జున’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడతానని... 2010, 2018 ఏషియాడ్‌లో కాంస్యం, 2014 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడైన సర్దార్‌ వివరించాడు. 

మరిన్ని వార్తలు