ఆ మ్యాచే మా కొంపముంచింది: పాక్‌ కెప్టెన్‌

6 Jul, 2019 10:03 IST|Sakshi
సర్ఫరాజ్‌ అహ్మద్‌

లండన్‌ : వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచే తమ కొంపముంచిందని పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌ ఘోర ఓటమే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసిందన్నాడు. తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చినా అదృష్టం కలిసిరాలేదని తెలిపాడు. ఇక పాకిస్తాన్‌ 5 మ్యాచ్‌లు గెలిచి 11 పాయింట్లు సాధించినప్పటికీ నెట్‌ రన్‌రేట్‌ లేని కారణంగా ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకోగా.. 11 పాయింట్లే ఉన్న న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. అయితే విండీస్‌తో ఘోర ఓటమే పాక్‌కు రన్‌రేట్‌ లేకుండా చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 105 పరుగులకే కుప్పకూలగా.. విండీస్‌ 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇదే పాక్‌ జట్టుపై తీవ్రప్రభావం చూపింది. (చదవండి: విండీస్‌ వలలో పాక్‌ గిలగిల)

శుక్రవారం బంగ్లాదేశ్‌తో విజయానంతరం సర్ఫరాజ్‌ మాట్లాడుతూ.. ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ‘గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తు మేం సెమీస్‌ బెర్త్‌ అందుకోలేకపోయాం. వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచే మాకు నష్టం కలిగించింది. భారత్‌తో ఓటమి ఆనంతరం ఆటగాళ్ల పోరాటం అద్భుతం. ఆరంభంలో మాజట్టు కూర్పు కూడా బాగాలేదు. షాహిన్‌ షా, హారీస్‌ సోహైల్‌ వచ్చిన తర్వాతా జట్టు బలపడింది. మా బ్యాట్స్‌మెన్‌ ఇమామ్‌,బాబర్‌, హ్యారిస్‌.. అదే విధంగా బౌలర్ల ప్రదర్శన చాలా బాగుంది. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌ల్లో షాహిన్‌ బౌలింగ్‌ మాకు మరింత ప్రోత్సాహంగా నిలిచింది. ఈ రోజైతే మరి ముఖ్యం. ఆరు వికెట్లు పడగొట్టాడనుకుంటా. ఇక మా ఆటపై కూర్చుని ఆత్మపరిశీలన చేసుకుంటాం. మా తప్పులను గుర్తించి దానికనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మాకు సుమారు రెండు నెలల సమయం దొరికింది. ఇక టోర్నీ ఆసాంతం మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు’ అని సర్ఫరాజ్‌ తెలిపాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 94 పరుగులతో పాక్‌ విజయం సాధించింది. (చదవండి: పాక్‌కు ఊరట గెలుపు)

>
మరిన్ని వార్తలు