ఆటగాళ్లలా చూడటం లేదు : సర్ఫరాజ్‌

23 Jun, 2019 12:55 IST|Sakshi

మెగా టోర్నీ ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో ఓటమి పాలైన నాటి నుంచి పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. వారితో పాటు పాక్‌ మాజీ ఆటగాళ్లు కూడా సర్ఫరాజ్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు మాజీ ఆటగాడు, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. ఓటమికి సర్ఫరాజ్‌ అనాలోచిత నిర్ణయమే కారణమని విమర్శించిన సంగతి తెలిసిందే. ‘సర్ఫరాజ్‌ ఇంత తెలివి తక్కువ పనిచేస్తాడని నేను అసలు ఊహించలేదు. పాకిస్తాన్‌ టాస్‌ గెలవగానే సగం మ్యాచ్‌ గెలిచాం అనుకున్నాం. కానీ సర్ఫరాజ్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చాడు. టాస్‌ చాలా కీలకం. పాకిస్తాన్‌ 260 పరుగులు చేసినా.. తమకున్న బౌలింగ్‌ వనరులతో కాపాడుకునేది. నిజంగా సర్ఫరాజ్‌ది బ్రెయిన్‌లెస్‌ కెప్టెన్సీ’ అంటూ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా సర్ఫరాజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

తనపై వెల్లువెత్తుతున్న విమర్శలపై సర్ఫరాజ్‌ స్పందించాడు. ఇలాంటి ఓటమి తమకేం కొత్త కాదని, గతంలో కూడా చాలాసార్లు భారత్‌ చేతిలో ఓడామని పేర్కొన్నాడు. నిజానికి భారత్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాతే పరిస్థితులు చక్కబడ్డాయని పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో తమపై వస్తున్న ట్రోలింగ్‌ గురించి మాట్లాడుతూ.. అసభ్యకర ట్రోల్స్‌ చేసే వారు పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. ఇక తమ ఓటమిపై మాజీ క్రికెటర్ల తీరును ప్రస్తావిస్తూ..‘ వాళ్ల కంటికి మేము ఆటగాళ్లలా కనిపించడం లేదు. వారు మమ్మల్ని చూసే తీరు వేరుగా ఉంటుంది. వాళ్లిప్పుడు టీవీ తెరపై దేవుళ్ల అవతారం ఎత్తారు’ అంటూ ఘాటుగా స్పందించాడు. కాగా గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో ఘోరపరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఇక పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సఫారీలతో తలపడనుంది.

మరిన్ని వార్తలు