సర్ఫరాజ్ సెంచరీ

26 Sep, 2013 01:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్కూల్ క్రికెట్‌లో సంచలన రికార్డులతో చెలరేగుతున్న 15 ఏళ్ల ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు భారత అండర్-19 జట్టు తరఫున కూడా సత్తా చాటాడు. ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల అండర్-19 టోర్నీలో సర్ఫరాజ్ (66 బంతుల్లో 101; 17 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీతో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై గెలిచింది. సర్ఫరాజ్‌కు తోడు స్థానిక ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (95 బంతుల్లో 94 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు.
 
  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ ఫార్య్చూన్ (99 బంతుల్లో 90; 15 ఫోర్లు) శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో సీవీ మిలింద్, అభిమన్యు లాంబా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 39.3 ఓవర్లలోనే 6 వికెట్లకు 275 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సర్ఫరాజ్, భుయ్ ఐదో వికెట్‌కు 19.5 ఓవర్లలోనే 159 పరుగులు జోడించడం విశేషం.  మరో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 147 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది.
 
 

మరిన్ని వార్తలు