హేయ్‌ సర్ఫరాజ్‌.. ఏందా బ్యాటింగ్!!

17 Oct, 2018 17:09 IST|Sakshi

అబుదాబి: 57 పరుగులకే సగం వికెట్లు పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సారథి ఎంతో ఆచితూచి ఆడాల్సివుంటుంది. వికెట్లకు అడ్డుగోడలా నిల్చొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాలి. కానీ పాకిస్తాన్‌ సారథి, వికెట్ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కానీ వికెట్ల ముందు ‘అడ్డుగోడ’లా నిలబడలేదు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ తెగువను చూసి అందరూ ముక్కున వేళేసుకుంటున్నారు. ప్రస్తుతం పాక్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ స్టాన్స్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక అభిమానులతో సహా మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా సర్ఫరాజ్‌ తీసుకున్న బ్యాటింగ్‌ స్టాన్స్‌పై కామెంట్స్‌ చేశారు. కొందరు అభిమానులు సర్ఫరాజ్‌ ఏంటా బ్యాటింగ్‌ అంటూ ఫన్నీగా స్పందించగా, మరికొందరు నీ ఆలోచనకు, బ్యాటింగ్‌ తెగింపుకు జోహార్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్‌ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ (4/78) దెబ్బకు 57/5. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆసీస్ స్పిన్నర్‌ లయన్‌ ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చాడు. ఆసీస్‌ బౌలర్లను తికమక పెట్టడానికి స్టాన్స్‌ మార్చుకొని బ్యాటింగ్‌ చేశాడు.  మూడు స్టంప్స్‌ను వదిలేసి ఎక్కడో దూరంగా నిలబడి బ్యాటింగ్‌ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆరంగేట్రం ఆటగాడు ఫఖర్‌ జమాన్‌(94; 8 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి సర్ఫరాజ్‌ (94; 7 ఫోర్లు)ల పోరాటంతో కోలుకుంది. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఆరు పరుగల దూరంలో సెంచరీ చేజార్చుకున్నా హీరోగా మిగిలాడు.  ఇక ఈ టెస్టులో పాక్‌ అదరగొడుతోంది. పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ అబ్బాస్(5/33) ధాటికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైంది. 

>
మరిన్ని వార్తలు