సర్ఫరాజ్‌కే నాయకత్వ పగ్గాలు

5 Feb, 2019 22:07 IST|Sakshi

వరల్డ్‌ కప్‌కు కెప్టెన్‌గా ప్రకటించిన పీసీబీ

కరాచీ: పాకిస్తాన్‌ జట్టుకు తొలి సారి చాంపియన్స్‌ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్‌ అహ్మద్‌ నాయకత్వంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నమ్మకముంచింది. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే పాక్‌ జట్టుకు సర్ఫరాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ చైర్మన్‌ ఇషాన్ మణి మంగళవారం ప్రకటించారు. 2017లో ఇంగ్లండ్‌ గడ్డపైనే పాక్‌ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన సర్ఫరాజ్‌ స్వదేశం తిరిగొచ్చాడు. అతని స్థానంలో షోయబ్‌ మాలిక్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్‌ కప్‌కు కూడా మాలిక్‌కే అవకాశం దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజా ప్రకటనతో దానికి ముగింపు లభించింది. సర్ఫరాజ్‌ కెప్టెన్సీపై తమకు ఎలాంటి సందేహాలు లేవని... ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌తో పాటు ప్రపంచ కప్‌కు కూడా అతని నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతుందని పీసీబీ చైర్మన్‌ స్పష్టం చేశారు.  (అవన్నీ గాలి మాటలే: సర్ఫరాజ్‌)

 
 

మరిన్ని వార్తలు