ధోనిని అనుకరించాడు.. కానీ

23 Jul, 2018 13:55 IST|Sakshi

బులవాయో: జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాక్‌ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను పాక్‌ 5-0 తేడాతో గెలుచుకుంది. అయితే చివరి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

చివరి ఓవర్లలో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనిని అనుకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వే బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కీపింగ్‌ చేస్తున్న సర్ఫరాజ్‌ 48వ ఓవర్‌లో బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గ్లోవ్స్‌ వదిలేసి బంతిని అందుకున్నాడు. ఫఖర్‌ జమాన్‌ను కీపింగ్‌ చేయాల్సిందిగా కోరాడు. అనంతరం ఓవర్‌ వేశాడు.

అయితే తన మొదటి ఓవర్‌ అద్భుతంగా వేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ కూడా సర్ఫరాజ్‌ వేశాడు. అయితే ఈ ఓవర్‌లో జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ పీటర్‌ మూర్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ను సాధించాడు. తన కెరీర్‌లో సర్ఫరాజ్‌ తొలిసారిగా రెండు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేయగా.. జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు మాత్రమే చేసింది.

అయితే ఈ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనిని ప్రయత్నించి విఫలమయ్యాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. 2009లో జోహానెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని విజయవంతంగా బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ కూడా తీశాడు. ధోనిలా బౌలింగ్‌ చేశాడు కానీ.. వికెట్‌ తీయలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు